Pingali Venkayya Untold Story :  జపనీస్ భాషను అనర్గళంగా మాట్లాడే ఓ వ్యక్తి వజ్రకరూర్ లో దొరికే వజ్రపురాళ్లపై పరిశోధనలు చేశారని మీకు తెలుసా. సౌతాఫ్రికాలో గాంధీజీని కలిసిన ఓ వ్యక్తి మునగాల పరగణాలో పత్తి విత్తనాలపై ప్రయోగాలు చేశాడని తెలుసా. కొలంబోలో చదువుకుని మచిలీపట్నం నేషనల్ కాలేజీ లో లెక్చరర్ గా పనిచేసిన ఓపెద్దాయనే.. కుర్రాడిగా ఉన్నప్పుడు భారత సైన్యంలో యోధుడిగా బోయర్ యుద్ధంలో పాల్గొన్నారని విన్నారా. అసలివన్నీ చేసిన వ్యక్తి  మన దేశగౌరవాన్ని త్రివర్ణపతాకంలా మార్చి రెపరెపలాడించారని తెలుసా. మనం చెప్పుకున్న అన్ని పనులు చేసింది ఒక్కరే. ఈ రోజు మనం మేరా భారత్ మహాన్ అన్నా...దేశం జెండా కున్నంత పొగరు నాలో ఉందని అరిచినా, ఏ మువ్వన్నెల పతాకం చూసి అంటున్నామో దానికా రూపాన్ని కల్పించిన మహనీయుడే పింగళి వెంకయ్య. ఆగస్టు 2న ఆయన 146వ జయంతి. ఆయన రూపొందించిన జెండాతో దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ చేసుకుంటున్న వేళ ఆ మహనీయుడి గురించి కొన్ని ఆసక్తికర అంశాలు మీ కోసం.


జాతివివక్షపై పోరాటం 


అసలే మాత్రం నమ్మడానికి వీలు లేకుండా విభిన్న రంగాల్లో నిష్ణాణుతుడని అనిపించుకున్నారు పింగళి వెంకయ్య. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మొవ్వ మండలం భట్ల పెనుమర్రులో జన్మించారు పింగళి వెంకయ్య.  తాతలు, తండ్రులు అంతా చల్లపల్లి జమీందార్లు సంస్థానాల్లో పెద్ద పెద్ద పదవుల్లో ఉండేవారు. దీంతో పింగళికి ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుపడింది. చల్లపల్లి, మచిలీపట్నంలో చదువుకున్న తర్వాత కొలంబోలో ఉన్నత విద్యను అభ్యసించారు పింగళి వెంకయ్య. తన 19ఏళ్ల వయస్సులో సైన్యంలో చేరి సౌతాఫ్రికాలో జరిగిన రెండో బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు పింగళి వెంకయ్య. అక్కడే జాతివివక్షపై పోరాటం చేస్తున్న మహాత్మాగాంధీని కలిశారు పింగళి వెంకయ్య.


1913లోనే జాతీయ జెండా రూపకల్పన ప్రయత్నాలు


చిన్నతనం నుంచి కొత్త విషయాలు తెలుసుకోవటం, నేర్చుకోవటం అందులో తనను తాను నిరూపించుకోవటం పింగళి వెంకయ్యకు ఎంతో ఇష్టమైన పని. అందుకే యుద్ధం ముగిసిన తర్వాత మద్రాసులో, బళ్లారిలో ప్లేగు ఇన్ స్పెక్టర్ గా పని చేసినా ఆ ఉద్యోగం వదిలేసి రైల్వేలో గార్డుగా పనిచేశారు. ఆ ఉద్యోగం వదిలేసి లాహేర్ లో డీఏవీ కాలేజ్ లో చేరి సంస్కృతం, ఉర్దూ, జపనీస్ భాషలను నేర్చుకున్నారు. 1913 నుంచి భారతదేశం కోసం ఓ జెండాను తయారు చేయాలని పింగళి వెంకయ్య ప్రయత్నాలు మొదలుపెట్టారు. దేశంలో ఎక్కడ జాతీయ కాంగ్రెస్ మహా సభలు జరిగినా అక్కడికి వెళ్లి జాతీయ జెండాపై నాటి నాయకులతో చర్చలు జరిపేవారు. అలా తొలి సారి పింగళి వెంకయ్య రూపొందించిన ఓ జెండాను 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఎగురవేశారు.  


మహాత్మా గాంధీతో పింగళి 


ఆ తర్వాత జాతీయ జెండాలో ఎలాంటి మార్పులు చేయాలన్న మహాత్మాగాంధీ పింగళి వెంకయ్యనే కోరే వారట. ఎందుకంటే మొత్తం 30దేశాలకు చెందిన జెండాలపై పరిశోధనలు చేశారు పింగళి వెంకయ్య. అలా 1919 లో జాతీయ పతాకంలో రాట్నం చిహ్నాన్ని పింగళి వెంకయ్య ప్రవేశపెట్టారు. కానీ ఇప్పుడున్న జాతీయ జెండాకు అతి దగ్గరగా ఉండే జెండాను 1921 లో బెజవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో రూపొందించారు పింగళి వెంకయ్య. కాషాయం, ఆకుపచ్చ రంగుల మధ్య రాట్నంతో జెండాను తయారు చేసి మహాత్మాగాంధీజీకి అందించారు పింగళి వెంకయ్య.  ఆ తర్వాత సత్యం, అహింసలకు నిదర్శనమైన తెలుపురంగు కూడా జెండాలోని ఉండాలని మహాత్ముడు బోధించటంతో పింగళి వెంకయ్య త్రివర్ణపతాకాన్ని రూపొందించి గాంధీజీకి అందించారు.


వజ్రాల తవ్వకాల్లో 


త్రివర్ణ పతాకం సర్వమతాలకు ప్రతీక అని గాంధీజికి వివరించారు పింగళి వెంకయ్య. 1947, జూలై 22న భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అందుకే భారతజాతికి జాతీయ జెండా రూపొందించిన వ్యక్తిగా పింగళి వెంకయ్య పేరు చిరస్థాయిలో నిలిచిపోయింది. కేవలం జెండా రూపకర్తగానే కాదు...అనేక విభిన్నమైన రంగాల్లో పింగళి వెంకయ్య నిష్ణాతులు. 1906 నుండి 1922 వరకు జాతీయోద్యమాలతో పాటు మునగాల పరగణా నడిగూడెంలో జమీందారు కోరిక మేరకు అక్కడే ఉండి కంబోడియా పత్ రకంపై పరిశోధనలు చేసి పత్తి వెంకయ్యగా పేరు తెచ్చుకున్నారు. జియాలజీలో పట్టభద్రుడైన అతను ఆంధ్రప్రదేశ్‌లో వజ్రాల తవ్వకాలలో రికార్డు సృష్టించాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వెంకయ్య నెల్లూరులో స్థిరపడి నవరత్నాల మీద అనేక పరిశోధక వ్యాసాలు రాశాడు. ఈ అంశంలో భారత ప్రభుత్వ సలహాదారుగా కూడా పనిచేశారు వెంకయ్య.  ఫలితంగా డైమండ్ వెంకయ్యగానూ పిలిచేవారు ఆయన్ను.


జపాన్ భాషలో నిష్ణాతుడు 


1913లో ఒక సందర్భంలో అతను బాపట్లలో జరిగిన సభలో జపాన్‌ భాషలో ప్రసంగించవలసి వచ్చింది. పూర్తి స్థాయిలో అతను ఆ భాషలో ప్రసంగించి ‘జపాన్‌ వెంకయ్య’ అని కీర్తి గడించాడు. మచిలీపట్నం నేషనల్ కాలేజ్ లో లెక్చరర్ గా పని చేసిన వెంకయ్య. సంపాదించిన డబ్బు మొత్తం కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఈ సమాజ అభ్యున్నతికే ఖర్చు పెట్టడం ద్వారా చివరికి ఏమీ మిగుల్చుకోలేకపోయారు పింగళి వెంకయ్య.మిలటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగరులో ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో చిన్న గుడిసె వేసుకొని గడపవలసి వచ్చింది. ఏఏనాడు ఏ పదవులు ఆశించలేదు..ఎవర్ని సాయం చేయండని కోరలేదు.  1963, జూలై 4 న 86 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు పింగళి వెంకయ్య.


పోస్టల్ స్టాంప్ 


వెంకయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఇటీవలే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా పింగళి కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్కరించాయి. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్యకు మరణానంతర భారతరత్న ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2009లో పింగళి వెంకయ్య జ్ఞాపకార్థం ఇండియన్ పోస్టల్ డిపార్టెంట్ ఓ స్టాంప్ ను విడుదల చేసింది. మచిలీపట్నంలో ఆయన జ్ఞాపకార్థం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవలే పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మీ కన్ను మూశారు. మన దేశం కోసం, భారత జాతి గౌరవం కోసం జీవితాంతం కష్టపడి అన్నీ వదులుకుని..త్యాగధనులుగా బతికిన పింగళి వెంకయ్య మాత్రం ప్రభుత్వాల గుర్తింపునకు నేటికీ నోచుకోలేకపోయారు.