National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. తాజాగా దిల్లీలోని నేషనల్ హెరాల్డ్ ఆఫీసుతో పాటు 10 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. 






విచారణ


నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ ఇటీవల విచారించింది. మొత్తం 3 రోజుల్లో 12 గంటల పాటు ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సుమారు 100 ప్రశ్నల వరకు సోనియా గాంధీని.. ఈడీ అడిగినట్లు తెలుస్తోంది.


ఈ నెల 21న 3 గంటలు, తర్వాత మరోసారి రెండు దఫాలుగా 6 గంటల పాటు ప్రశ్నావళి కురిపించారు. అనంతరం మరో రోజు 3 గంటల పాటు ప్రశ్నలు సంధించారు.


ఇదీ కేసు


కాంగ్రెస్ పార్టీ, గాంధీలతో ముడిపడిన నేషనల్ హెరాల్డ్ కేసు ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐ) తమ అధీనంలోకి తెచ్చుకోవడం వెనుక మోసం, కుట్ర వంటి ఆరోపణలు ఉన్నాయి. 2010లో ఏజేఎల్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావడంతో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఎల్) కంపెనీ దానిని టేకోవర్ చేసింది. దానికి డైరెక్టర్లుగా ఉన్న సుమన్ దుబే, టెక్నోక్రాట్ శామ్ పిట్రోడాలకు గాంధీ విధేయులుగా పేరుంది.


ఈ కేసుపై సుబ్రహ్మణ్య స్వామి దిల్లీ హైకోర్టులో గతంలో ఫిర్యాదు చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కాంగ్రెస్‌ పార్టీకి బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకొనే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్‌ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఇందులో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ సహా ఏడుగురిని పేర్లను చేర్చారు. వీరిలో ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా‌ తదితరులు ఉన్నారు.


Also Read: Biden on Ayman Al-Zawahiri: అమెరికన్ల జోలికొస్తే వెంటాడి, వేటాడి చంపుతాం: బైడెన్ మాస్ వార్నింగ్


Also Read: Al-Qaeda Chief Killed: అమెరికా డ్రోన్ అటాక్, అల్ ఖైదా అధినేత అల్ జవహరీ హతం