USA Vs China: అమెరికా, చైనాల మధ్య తైవాన్ రగడ తారస్థాయికి చేరుకుంది. అగ్రరాజ్యం సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటిస్తారని వార్తలు రావడంతో చైనా గట్టిగా హెచ్చరించింది.


నాన్సీ పెలోసీ తైవాన్‌లో అడుగుపెడితే తమ సైన్యం చూస్తూ కూర్చోదని హెచ్చరించింది. అయితే చైనా వార్నింగ్‌ ఇవ్వడంతో అమెరికా అప్రమత్తమైంది. స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనకు ముందే నాలుగు యుద్ధ నౌకలను తైపీ సమీపంలోని సముద్ర జలాల్లో మోహరించింది.






తగ్గేదేలే


అమెరికా మోహరించిన నాలుగు నౌకల్లో యుద్ధ విమానాలను మోసుకెళ్లే నౌక కూడా ఉంది. తైవాన్‌, ఫిలిప్పైన్స్‌కు తూర్పున, జపాన్‌కు దక్షిణాన ఫిలిప్పైన్స్ సముద్రంలో అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ రొనాల్డ్‌ రీగన్‌ను మోహరించినట్లు అగ్రరాజ్య నౌకాదళ అధికారులు తెలిపారు.


ఈ రీగన్‌ నౌకలో గైడెడ్‌ మిసైల్స్‌, యూఎస్‌ఎస్‌ రాకెట్లు, నౌకా విధ్వంసక మిసైల్స్‌ వంటివి కలిగి ఉన్నట్లు చెప్పారు. ఈ మోహరింపు సాధారణ ప్రక్రియలో భాగమేనని అధికారులు తెలిపారు. కానీ ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే దానికి తగినట్లుగానే తమ స్పందన ఉంటుందని గట్టిగానే చెప్పారు. 


పెలోసీ తైవాన్ పర్యటన ఇంకా ఆమె పబ్లిక్ షెడ్యూల్‌లో లేదు. ఆమె పర్యటన కన్ఫార్మ్ అయితే 1997లో న్యూట్ గింగ్రిచ్ తర్వాత అక్కడికి వెళ్లిన US హౌస్ స్పీకర్‌గా నిలుస్తారు. బీజింగ్ ఈ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. అధికారికంగా పెలోసి ఆసియా పర్యటనలో సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్‌లను మాత్రమే సందర్శిస్తారు.


అయితే టెక్సాస్ రిపబ్లికన్, హౌస్ విదేశీ వ్యవహారాల కమిటీ సీనియర్ సభ్యుడు మైఖేల్ మెక్‌కాల్, డెమొక్రాట్ అన్నా ఎషూ గత వారం యూఎస్ మీడియాతో మాట్లాడుతూ పెలోసీ తమను తైవాన్‌కు ఆహ్వానించినట్లు చెప్పారు. సోమవారం నాన్సీ, ఆరుగురు సభ్యుల కాంగ్రెస్ ప్రతినిధి బృందం సింగపూర్ ప్రధానమంత్రి లీ హ్సీన్ లూంగ్‌తో చర్చలు జరిపారు. సింగపూర్ ప్రాంతీయ శాంతి, భద్రత కోసం స్థిరమైన US-చైనా సంబంధాలు ముఖ్యమని సింగపూర్ ఓ ప్రకటనలో తెలిపింది.


Also Read: Monkeypox Cases in India: దేశంలో 8కి చేరిన మంకీపాక్స్ కేసులు- కూల్‌గా ఉండమని కేంద్రం సూచన


Also Read: Gujarat Assembly Elections 2022: 'ఆపరేషన్ గుజరాత్' పనిలో కేజ్రీవాల్ బిజీబిజీ- అప్పుడే అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా