Monkeypox Cases in India: దేశంలో మంకీపాక్స్ వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మంగళవారం మరో రెండు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దిల్లీలో మూడో కేసు నమోదుకాగా, కేరళలో ఐదో కేసు వచ్చింది.
8కి చేరిన కేసులు
యూఏఈ నుంచి వచ్చిన కేరళ వ్యక్తికి పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బాధితుడి వయసు 30 సంవత్సరాలని చెప్పారు. మలప్పురంలోని మంజేరి మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో అతనికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. బాధిత వ్యక్తి జులై 27న యూఏఈ నుంచి కోజికొడ్ చేరుకున్నాడు.
దిల్లీలో
మరోవైపు దిల్లీలో కూడా మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో దేశ రాజధానిలో మంకీపాక్స్ కేసుల సంఖ్య మూడుకు చేరగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 8కి పెరిగింది. ఇప్పటికే మంకీపాక్స్ సోకిన ఓ వ్యక్తి మృతి చెందాడు.
టెన్షన్ వద్దు
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో మాట్లాడారు. కేరళలో తొలి కేసు రావడానికి ముందే మార్గదర్శకాలు విడుదల చేసినట్లు ఆరోగ్య మంత్రి గుర్తు చేశారు.
మంకీపాక్స్‌తో కేరళ యువకుడి మృతి చెందడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి తీరును నిశితంగా పరిశీలించేందుకు సోమవారం ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశంలో మంకీ పాక్స్ వ్యాప్తి ధోరణులను సమీక్షించి కేంద్రానికి నివేదించనుంది. వైరస్ కట్టడికి ఏమేం చర్యలు తీసుకోవాలి అనే దానిపై సూచనలు ఇవ్వనుంది.
Also Read: TMC MP Mahua Moitra Bag Price: ఆ బ్యాగ్‌ను MP ఎందుకు దాచేశారు? దాని ధర తెలిస్తే అవాక్కవుతారు!