Ravindra Jadeja Tweet: టీమ్‌ఇండియా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) చెన్నై సూపర్‌ కింగ్స్‌ నుంచి విడిపోయాడా? వచ్చే సీజన్లో ముంబయి ఇండియన్స్‌లో చేరుతున్నాడా? వాంఖడేలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించబోతున్నాడా? అంటే సోషల్‌ మీడియాలో అవుననే కామెంట్లే ఎక్కువగా వస్తున్నాయి. ఇందుకు ఓ కారణం ఉందండోయ్‌!






ఆ ట్వీట్‌ వల్లే!


వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత రవీంద్ర జడేజా ట్విటర్లో ఓ పోస్టు చేశాడు. టీమ్‌ఇండియా జెర్సీలు ధరించిన చిత్రాలు పెట్టాడు. 'బ్లూ అడిక్షన్‌' అంటూ చిన్న వ్యాఖ్య జత చేశాడు. దాంతో అతడు ముంబయి ఇండియన్స్‌లో (Mumbai Indians) చేరుతున్నాడన్న ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఐదు సార్లు ఛాంపియన్‌ జట్టుకు ఆడబోతున్నానంటూ అతడు పరోక్షంగా చెప్పాడని కొందరు అంటున్నారు. మరికొందరేమో అతడు చెన్నై సూపర్‌కింగ్స్‌లోనే (Chennai Superkings) ఉండాలని కోరుకున్నారు. ఇంకొందరు ఐపీఎల్‌లో (IPL) ఇప్పుడు బ్లూ జెర్సీ ధరిస్తున్న జట్లు ఎక్కువే ఉన్నాయని అంటున్నారు. ఏ జట్టుకు వెళ్తాడో ఇప్పుడే చెప్పలేమని పేర్కొంటున్నారు.






కెప్టెన్సీ తొలగింపుతో విభేదాలు!


ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో రవీంద్ర జడేజా ఒకడు. అరంగేట్రం సీజన్లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడిన అతడు 2013లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు వచ్చాడు. అప్పట్నుంచి అప్రతిహతంగా కొనసాగాడు. అతడి విలువను గుర్తించిన సీఎస్‌కే గతేడాది రూ.16 కోట్లతో అతడిని రీటెయిన్‌ చేసుకుంది. హఠాత్తుగా కెప్టెన్‌గా ప్రకటించింది. కానీ ఈ సీజన్‌ అతడికి అచ్చి రాలేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో విఫలమయ్యాడు. పరుగులేమీ చేయలేదు. వికెట్లూ పడగొట్టలేదు.






సోషల్‌ మీడియాలో అన్‌ఫాలో!


ఆటగాళ్లు లేకపోవడంతో సీఎస్‌కే సైతం విజయాలేమీ సాధించలేదు. అదే సమయంలో జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఆటపై దృష్టి పెట్టేందుకే ఇలా చేశాడని అన్నారు. అయితే అతడిని ఉద్దేశ పూర్వకంగానే కెప్టెన్సీ నుంచి తొలగించారని అభిమానులు విమర్శించారు. ఆ తర్వాత జడ్డూను సీఎస్‌కే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం మానేసింది. దాంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. దాదాపుగా అతడు వచ్చే సీజన్లో కొత్త జట్టుకే ఆడతాడని తెలుస్తోంది.