26/11 సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు రెండు కేసుల్లో శిక్ష పడింది. న్యాయస్థానం అతని ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని, ₹ 3,40,000 జరిమానా విధించాలని ఆదేశించింది.


హఫీజ్ సయీద్ నిర్మించినట్లు ఆరోపిస్తున్న మసీదు, మదర్సా స్వాధీనం చేసుకోనున్నట్లు పాకిస్థాన్ మీడియా చెబుతోంది. 70 ఏళ్ల హఫీజ్ సయీద్ గతంలో ఉగ్రవాదానికి ఫైనాన్సింగ్ చేసిన పలు కేసుల్లో శిక్ష అనుభవించారు. 2020లో కూడా అతనికి 15 ఏళ్ల జైలు శిక్ష పడింది.


పాకిస్తాన్‌లో వివిధ రూపాల్లో నిర్బంధంలో ఉండేవారు. పాకిస్తాన్‌ బయట కూడా సంవత్సరాలు గడిపారు. కొన్నిసార్లు గృహనిర్బంధంలో ఉన్నారు. కానీ సమయం వచ్చినప్పుడల్లా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేష ప్రసంగాలు చేస్తూ తిరుగుతున్నారు.


2019లో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు ముందు హఫీజ్‌ అరెస్టయ్యారు. ఆ సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. పదేళ్ల శ్రమ ఫలించి సయీద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ట్వీట్ చేశారు.







పంజాబ్‌లో సయీద్‌ను అరెస్టు చేసిన ఉగ్రవాద నిరోధక విభాగం... లాహోర్‌ నుంచి గుజ్రాన్‌వాలా తీసుకెళ్లారు. సయీద్‌ను 2001 నుంచి ఎనిమిది సార్లు అరెస్టు చేసి విడుదల చేసినట్లు యూఎస్ హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ పేర్కొంది. నవంబర్ 26, 2008న ముంబైలో 166 మంది మరణించిన ఉగ్రదాడికి హఫీజ్ సయీద్ కారణమని ఆరోపణలు ఉన్నాయి.