మేడపై నుంచి కిందికి చూడాలంటేనే కొందరు వణికిపోతారు. అలాంటిది ఆరువేల అడుగుల పై నుంచి చూడమంటే గుడ్లు తేలేస్తారు. ఓ వ్యక్తి మాత్రం చూడటంతోనే ఆగిపోలేదు.. ఏకంగా రెండు తాళ్లపై నడిచి గిన్నీస్‌బుక్‌లో చోటు దక్కించుకున్నాడు. 


గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇటీవల 'హయ్యస్ట్ స్లాక్‌లైన్ వాక్'కు సంబంధించిన గుండెలు అదిరే వీడియో షేర్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది. 


రాఫెల్ జుగ్నో బ్రిడి అనే 34 ఏళ్ల వ్యక్తి చేసిన సాహనానికి నెటిజన్లు అశ్చర్యపోతున్నారు. గుండెల్లో దమ్ముకున్న వాళ్లే ఈ వీడియో చూడాలని సూచనలు చేస్తున్నారు. 






భూమిపై నుంచి 6,236 అడుగుల ఎత్తులో నడిచి అబ్బురపరిచాడు. రెండు హాట్ ఎయిర్ బెలూన్‌ల మధ్య కట్టిన స్లాక్‌లైన్‌పై చెప్పులు లేకుండా నడిచాడీ వ్యక్తి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫా కంటే రెట్టింపు ఎత్తులో చేసిన సాహసం ఇది. 


గిన్నిస్ ప్రకారం 2021 డిసెంబర్ 2న బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలో ఇలాంటి సాహసం చేసిన బ్రెజిల్ వ్యక్తి పేరిట ఇప్పటి వరకు ఈ రికార్డు  ఉండేది. ఇప్పుడు దీన్ని జుగ్నోబ్రిడీ బద్దలు కొట్టాడు. 


ఈ సాహసంపై బ్రిడి చాలా అద్భుతంగా వివరించాడు. "ఇది నా జీవితాశయం. హైలైన్‌పై నడుస్తున్నప్పుడు వచ్చే స్వేచ్ఛ చాలా ప్రత్యేకమైనది. ఇలా నడవాలని చాలా సార్లు అనుకున్నాను. కదులుతూ ఉన్న రెండు ఎయిర్‌ బెలూన్‌ల ఒకదాని నుంచి ఇంకొకటి క్రాస్‌ చేయడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. దీని కంటే థ్రిల్‌ ఏదీ తీసుకురాలేదు."