Pakistan Crisis:
ఆపద్ధర్మ ప్రధాని అన్వార్
పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ ఇటీవలే రద్దైంది. ఎన్నికలు జరిగేలోగా ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా ఎవరు ఉంటారన్న ఉత్కంఠకు తెరపడింది. సెనేటర్ అన్వర్ ఉల్ హక్ కకర్ (Anwaar-ul-Haq Kakar)ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇదే విషయాన్ని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. నేషనల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత రాజా రియాజ్ అన్వర్ నియామకానికి ఆమోదం తెలిపారు. మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అంగీకరించిన తరవాత అధికారికంగా అన్వర్ పేరుని ప్రకటించారు. బలూచిస్థాన్‌కి చెందిన అన్వార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేని వ్యక్తిని ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నుకోవడం కీలకంగా మారింది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితిని ఆయన ఎలా డీల్ చేస్తారన్న దానిపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం...ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎన్నికల బాధ్యత తీసుకుంటారు. 90 రోజుల్లోగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్ దిగువ సభ రద్దైన తరవాత కచ్చితంగా మూడు నెలల్లోగా ఎన్నికలు జరగాలి. ఆ లెక్కన చూసుకుంటే ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశం దాదాపు మునిగిపోయే స్థితిలో ఉంది. ఈ తరుణంలోనే అన్వర్‌కి అదనపు అధికారాలు ఇచ్చే అవకాశాలున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడం సహా, ఆర్థిక సంక్షోభాన్ని తీర్చే ప్రయత్నాలు చేయడమూ ఆయన ముందున్న సవాళ్లు. అయితే...ఎన్నికలు ఆలస్యంగా జరిగే అవకాశాలున్నాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి.