Niger Violence:


నైగర్‌లో తిరుగుబాటు 


ఆఫ్రికన్ దేశం నైగర్‌లో హింసతో అట్టుడుకుతోంది. తిరుగుబాటుతో దేశమంతా సతమతం అవుతోంది. ఈ అల్లర్లతో అక్కడి భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. వీలైనంత త్వరగా ఇండియాకు వచ్చేయాలని సూచించింది. ఇప్పటికే పలు ఐరోపా దేశాలు ఇదే పిలుపునిచ్చాయి. నైగర్ నుంచి వెనక్కి వచ్చేయాలని తమ పౌరులకు సూచించింది ఫ్రాన్స్. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 


"భారత ప్రభుత్వం నైగర్‌లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులు అక్కడ ఉండాల్సిన అవసరం లేదనిపిస్తోంది. వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వదిలి వచ్చేయండి. ప్రస్తుతానికి విమానాలు పంపి తీసుకొచ్చేందుకు వీల్లేకుండా పోయింది. సరిహద్దులు దాటుకుని వచ్చే సమయంలో జాగ్రత్తలు పాటించండి. నైగర్‌కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్న వాళ్లు కూడా కొన్ని రోజులు ఆగితే మంచిది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. అక్కడి పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకూ తప్పదు. నైగర్‌లో దాదాపు 250 మంది భారతీయులున్నట్టు మాకు సమాచారం ఉంది. ప్రస్తుతానికి వాళ్లంతా సేఫ్‌గానే ఉన్నారు. అక్కడి నుంచి వచ్చేందుకు భారత్ తరపున అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం."


- అరింద్ బగ్చీ, విదేశాంగ శాఖ ప్రతినిధి