Shikhar Dhawan: 

ఆసియా క్రీడల జట్టులో తన పేరు లేకపోవడంతో షాకయ్యానని సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan)  అంటున్నాడు. తనకు కచ్చితంగా చోటు ఉంటుందనే భావించానని తెలిపాడు. అయితే సెలక్టర్ల ఉద్దేశాన్ని వెంటనే గ్రహించానని పేర్కొన్నాడు. త్వరలోనే టీమ్‌ఇండియాలోకి పునరాగమనం చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. పీటీఐ వార్తా సంస్థతో అతడు ప్రత్యేకంగా మాట్లాడాడు.

ఒకప్పుడు టీమ్‌ఇండియాకు శిఖర్ ధావన్‌ రెగ్యులర్‌ ఓపెనర్‌. రోహిత్‌ శర్మతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలు అందించాడు. అయితే రెండేళ్లుగా సెలక్టర్లు అతడిని పక్కన పెట్టేశారు. కేవలం వన్డేలకు మాత్రమే ఎంపిక చేస్తున్నారు. ఇప్పుడూ అదీ లేదు. అన్ని ఫార్మాట్ల నుంచీ తప్పించేశారు. ప్రధాన జట్టు విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు కుర్రాళ్లతో కూడిన జట్టును గబ్బర్‌ కొన్నాళ్లు నడిపించాడు. దాంతో చైనాలో జరిగే ఆసియా క్రీడలకు కెప్టెన్సీ ఇస్తారని భావించినా అలా జరగలేదు. రుతురాజ్‌ గైక్వాడ్‌కు సారథ్యం అప్పగించారు.

'ఆసియా క్రీడల్లో నా పేరు లేకపోవడంతో షాకయ్యా. సెలక్టర్ల ఆలోచనలు భిన్నంగా ఉన్నాయని గ్రహించాను. వారి నిర్ణయాన్ని అంగీకరించాను. రుతురాజ్ గైక్వాడ్‌ జట్టును నడిపిస్తుండటం హ్యాపీ. అంతా కుర్రాళ్లే ఉన్నారు. వారంతా రాణిస్తారన్న ధీమా ఉంది' అని శిఖర్‌ ధావన్‌ అన్నాడు. జాతీయ  జట్టులో సెలక్టర్లు అవకాశాలు ఇవ్వనప్పటికీ గబ్బర్‌ సానుకూలంగానే ఉన్నాడు. అతి త్వరలోనే పునరాగమనం చేస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.

'పునరాగమానికి నేనెప్పుడూ సిద్ధమే. అందుకే నేనెప్పుడూ ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ చేస్తాను. ఒక శాతమో 20 శాతమో కచ్చితంగా అవకాశాలైతే ఉంటాయి. నా శిక్షణ, ఆటను ఎప్పుడూ ఆస్వాదిస్తుంటాను. ఇవే కదా నా నియంత్రణలో ఉంటాయి. తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తాను' అని గబ్బర్‌ చెప్పాడు. టీమ్‌ఇండియాలో చోటు లేనప్పటికీ అతడికి బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టు ఇచ్చింది. దాంతో జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఎక్కువ సమయం గడుపుతున్నాడు.

టీమ్‌ఇండియాలో అవకాశం రాకపోతే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో పంజాబ్‌ కింగ్స్‌కు ట్రోఫీ అందించడమే దృష్టి సారిస్తానని ధావన్‌ అంటున్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ, విజయ్‌ హజారే ఆడతానని చెప్పాడు. 'నా భవిష్యత్తు గురించి ఏ సెలక్టర్‌నూ కలవలేదు. నేనెప్పుడూ ఎన్‌సీఏకు వెళ్తుంటాను. అక్కడ సమయం ఆస్వాదిస్తాను. అక్కడి సౌకర్యాలు అద్భుతంగా ఉంటాయి.  అక్కడే నా కెరీర్‌ మలుపు తిరిగింది. అందుకు కృతజ్ఞుడిని' అని తెలిపాడు.

'నేను ఐపీఎల్‌కు సన్నద్ధం అవ్వాల్సి ఉంటుంది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, విజయ్‌ హజారే ఆడతాను. వరుస విరామాలు వస్తే ఘనంగా పునరాగమనం చేయాల్సి ఉంటుంది. అది కష్టమని భావిస్తే కష్టంగానే ఉంటుంది. నేనెప్పుడూ అలా ఆలోచించను. ఇతర ఆటగాళ్లు ఎక్కువ ఫార్మాట్లు ఆడుతుంటూ ఫ్లో వేరేగా ఉంటుంది. అలాంటప్పుడు వారు రాణిస్తే వెంటనే ఎక్కువ మంది దృష్టిలో పడతారు' అని గబ్బర్‌ పేర్కొన్నాడు.

'నేనెప్పుడూ సంతోషంగా ఉంటాను. వన్డే ప్రపంచకప్‌ ఆడితే ఇంకా హ్యాపీ. టీమ్‌ఇండియా తరఫున రాణించడం ఆశీర్వాదమే. ప్రస్తుత దశలో ఒక్కో ఏడాదీ దాటుకుంటూ వెళ్లాలి. నేను పంజాబ్‌కు ఐపీఎల్‌ ట్రోఫీని అందించాలి. వచ్చే ఏడాది కొట్టేయాలని కోరుకుంటున్నాం. భారత జట్టులో నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ను ఆడిస్తేనే మంచిది. అతడికి అనుభవం ఉంది. కొంత కాలంగా వరుసగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నాడు. ప్రపంచకప్‌లో శుభమన్‌ గిల్‌ రాణించాలని కోరుకుంటున్నా. రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చూడాలి. గత ప్రపంచకప్‌లో అతడు అద్భుతంగా ఆడాడు. ఐదు సెంచరీలు కొట్టాడు' అని శిఖర్‌ ధావన్‌ వెల్లడించాడు.