ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ దాడులకు తెగబడగా ఇజ్రాయెల్ దాడులను తిప్పికొడుతోంది. ఈ యుద్ధం నేపథ్యంలో ఇరు వైపులా 500 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. హమాస్ మిలిటెంట్లు గాజా స్ట్రిప్ నుంచి 5వేల రాకెట్లను ప్రయోగించారు. బుల్డోజర్లతో ఆక్రమణకు పాల్పడుతున్నారు. ఆపరేషన్ 'అల్-అక్సా ఫ్లడ్'తో హమాస్ ఇజ్రాయెల్‌పై యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆపరేషన్ 'స్వార్డ్స్ ఆఫ్ ఐరన్'తో ప్రతీకారం చర్యలకు దిగింది. హమాస్ దాడుల కారణంగా ఇప్పటికే ఇజ్రాయెల్‌లో మూడు వందల మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో దాదాపు 200 మంది మరణించినట్లు పాలిస్తీనా వెల్లడించింది. ఇరువైపులా ఇప్పటికే వేలాది మంది గాయాలపాలయ్యారు.
ఈ దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. సుదీర్ఘమైన, కష్టతరమైన యుద్ధానికి దిగుతున్నారంటూ ఆయన పాలస్తీనాను హెచ్చరించారు. ఇది ఇజ్రాయెల్‌కు బ్లాక్ డే అని, ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. హమాస్ సామర్థ్యాలను నాశనం చేయడానికి తమ ఐడీఎఫ్ సైన్యం తన శక్తినంతా ఉపయోగిస్తుందని నెతన్యాహు వెల్లడించారు. హమాస్ దాడులను తీవ్రంగా తిప్పికొట్టి ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. మరోవైపు హమాస్ ఉగ్రవాదులు డజన్ల కొద్దీ ఇజ్రాయెల్ సైనికులను బంధించినట్లు చెప్తోంది.
ఉగ్రవాదులు ఇళ్లలోకి చొరబడి విధ్వంసం చేశారని, పౌరులను హతమార్చారని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు. వందలాది మంది తమ దేశంపై దాడికి దిగారని, తమ సైన్యం దేశం లోపలికి ప్రవేశించిన వారితో పోరాడుతోందని చెప్పారు. గాజా నుంచి పెద్ద ఎత్తున రాకెట్లను ప్రయోగించడంతో ఇజ్రాయెల్ ప్రజలు పరిస్థితి దారుణంగా మారింది. పెద్ద ఎత్తున పొగ అలుముకుంది. దీంతో ప్రజలను అలర్ట్ చేసేందుకు సైరన్ మోగించారు. ప్రజలంతా భయభ్రాంతులకు గురై ఇళ్లలో, భవనాల్లో దాక్కున్నారు. హమాస్ ఉగ్రవాదులు గాజాతో సరిహద్దులోని ఇజ్రాయెల్ పట్టణాలపై, సైనిక పోస్టులపై దాడులు చేస్తున్నారు. రోడ్లపై కనిపించిన వారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియోహ్ మాట్లాడుతూ తమ గ్రూప్ విజయం అంచున ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. బందీలుగా ఉన్న అనేకమంది ఇజ్రాయెలీల చిత్రాలను హమాస్ విడుదల చేసింది. హమాస్ దాడి కారణంగా గాజా సమీపంలోని ఇజ్రాయెల్ పట్టణంలోని వీధుల్లో పరిస్థితి భయానంకంగా ఉంది. మృతదేహాలు వీధుల్లో చిందరవందరగా పడి ఉన్నాయి. రోడ్లపై కార్లు ధ్వంసమై కనిపించాయి. హమాస్ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అని తేడా లేకుండా అమానవీయంగా దాడులకు తెగబడిందని, ఘోరమైన తప్పు చేస్తున్నట్లు వారు త్వరలోనే గ్రహిస్తారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఓ వీడియో ప్రకటన ద్వారా హమాస్‌ను హెచ్చరించారు.
ఇజ్రాయెల్‌పై దాడులను అమెరికా ఖండించింది. తాము ఇజ్రాయెల్‌కు మద్దతిస్తామని, కావాల్సిన అన్ని రకాల సహాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. మానవీయ కోణంలో ఇదొక ఘోరమైన విషాదంగా ఆయన పేర్కొన్నారు. తనను, తన ప్రజలను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని, ఈ పరిస్థితో ప్రయోజనం పొందేందుకు ఇజ్రాయెల్‌తో శత్రుత్వం ఉన్న వారు ప్రయత్నించొద్దంటూ అమెరికా హెచ్చరించింది. ఐరాస భద్రతామండలి కూడా అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. భారత్, యూకే, జర్మనీ సహా పలు దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి.