Israel Palestine Attack:
నెతన్యాహు హెచ్చరికలు..
ఇజ్రాయేల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడులు బీభత్సం సృష్టించాయి. ఇప్పటికే 500 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. పరిస్థితులు చేయి దాటి పోతున్నాయి. ఇప్పటికే ప్రధాని బెంజమిన్ నెనన్యాహు యుద్ధానికి సిద్ధమే అని ప్రకటించారు. ఇప్పుడు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. హమాస్ ఉగ్రవాదులను తీవ్రంగా హెచ్చరించారు. గాజా వద్ద దాక్కుని దాడులు చేస్తున్న వాళ్లను ముక్కలు ముక్కలు చేసేస్తామని తేల్చి చెప్పారు. గాజాలో ఉన్న పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అక్కడి నుంచి బయటకు వచ్చి సేఫ్‌టీ షెల్టర్‌లలో తలదాచుకోవాలని సూచించారు. ఇజ్రాయేల్ సైన్యం హమాస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆపరేషన్‌ని సహకరించాలని కోరారు. అన్ని చోట్లా వాళ్లు నక్కి ఉన్నారని...వాళ్లను నాశనం చేసేంత వరకూ ఊరుకోమని స్పష్టం చేశారు.
"గాజాలో చాలా చోట్ల హమాస్ ఉగ్రవాదులు నక్కి ఉన్నారు. అక్కడి నుంచే దాడి చేస్తున్నారు. వాళ్లను ఎలాగైనా కనుగొంటాం. ముక్కలు ముక్కలు చేసేస్తాం. గాజా పౌరులకు నాదొకటే విజ్ఞప్తి. వెంటనే సిటీ వదిలి బయటకు వచ్చేయండి. ఇజ్రాయేల్ సైన్యం చేపడుతున్న ఆపరేషన్‌కి సహకరించండి. హమాస్ ఉగ్రవాదులు మనల్ని చంపాలని చూస్తున్నారు. ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్న వాళ్లపై దాడులు చేయాలని కుట్ర చేస్తున్నారు. పిల్లలన్న కనికరం కూడా లేకుండా రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు"
- బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయేల్ ప్రధాని
Israel Defense Forces (IDF) కి హమాస్ ఉగ్రవాదులను నాశనం చేసే సామర్థ్యం ఉందని తేల్చి చెప్పారు నెతన్యాహు. అమాయక ప్రజల్ని చంపుతుంటే చూస్తూ ఊరుకోం అని వెల్లడించారు. కచ్చితంగా యుద్ధం చేస్తామని, గెలిచి తీరతామని అన్నారు. ట్విటర్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టిన ఆయన...వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.