ఇజ్రాయెల్ పౌరులకు శనివారం పీడకలలా మారిపోయింది. సాధారణ రోజులా గడిచిపోతుందని భావించిన ప్రజలకు వారి జీవితంలో అత్యంత భయంకరమైన రోజుగా మిగిలిపోయింది. హమాస్ మిలిటెంట్లు గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పై  5వేల రాకెట్లను ప్రయోగించారు.  ఇజ్రాయెల్-గాజా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హమాస్ గ్రూప్ సభ్యులు ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చారు. ఇళ్లు, పోలీస్ స్టేషన్లలో చొరబడి దొరికిన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఆపరేషన్ 'అల్-అక్సా ఫ్లడ్'తో హమాస్ ఇజ్రాయెల్‌పై యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆపరేషన్ 'స్వార్డ్స్ ఆఫ్ ఐరన్'తో ప్రతీకారం చర్యలకు దిగింది. 


ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై కీలక పాయింట్లు
* హమాస్ చొరబాటుదారుల దాడుల్లో మరణించిన వారి సంఖ్య కనీసం 70కి చేరినట్లు వార్తా సంస్థ AP తెలిపింది.  ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఉదయం దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 545 మంది ఆసుపత్రి పాలయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ జాతీయ రెస్క్యూ సర్వీస్ సహాయక చర్యల్లో నిమగ్నమైంది.  
* రమల్లాలోని ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, పాలస్తీనా ప్రజలు, ఇజ్రాయెల్ బాంబ్ దాడుల నుంచి తమను తాము రక్షించుకోవచ్చని పాలస్తీనా అథారిటీ ప్రెసిడెంట్ మహమూద్ అబ్బాస్ తెలిపారు. 
* పాలస్తీనా ఆపరేషన్ అరబ్ దేశాలకు ఒక సందేశమని, హమాస్ ప్రతినిధి మరియు గాజా ప్రభుత్వ మాజీ ఉప విదేశాంగ మంత్రి ఘాజీ హమద్ అల్ జజీరాతో అన్నారు. ఇజ్రాయెల్ శత్రు రాజ్యమని ప్రకటించారు. ఇజ్రాయెల్‌తో సంబంధాలను తెంచుకోవాలని అరబ్ దేశాలను కోరారు. ఎందుకంటే శాంతి లేదా మంచి పొరుగు దేశంగా ఇజ్రాయెల్ ను నమ్మలేమని స్పష్టం చేశారు. 
* ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, ఆ దేశంలోని భద్రతల పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. యూరోపియన్ యూనియన్, యునైటైడ్ కింగ్, ఉక్రెయిన్ దేశాలు హమాస్ దాడులను ఖండించాయి. అంతేకాకుండా ఇజ్రాయెల్‌కు తమ సంఘీభావాన్ని ప్రకటించాయి.
* గాజా నుంచి ఇజ్రాయెల్‌పై జరిగిన తీవ్రవాద దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్ ప్రకటించారు. హమాస్ టెర్రరిస్టులు క్రూరమైన దాడిపై ఇటలీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  పాలస్తీనా దాడుల నుంచి తమను తాము రక్షించుకునే  హక్కు ఇజ్రాయెల్ కు ఉందని స్పష్టం చేసింది. అమాయక పౌరులపై జరుగుతున్న ఉగ్రవాదాన్ని, హింసను ఖండించింది. 
* హమాస్ టెర్రరిస్టుల దాడులను ఇజ్రాయెల్ సీరియస్ గా తీసుకుంది. దాడులను తిప్పికొట్టేందుకు ఆపరేషన్ 'స్వర్డ్స్ ఆఫ్ ఐరన్' ప్రారంభించింది. గాజా స్ట్రిప్‌లోని హమాస్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. బాంబ్ దాడులకు దిగింది. 
* ఇజ్రాయెల్ పౌరులు శాంతియుతంగా నిద్రిస్తున్న సమయంలో దాడులు జరిగాయని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ అన్నారు. పాలస్తీనాలోని హమాస్ టెర్రరిస్టుల దాడిని పిరికి చర్యగా అభివర్ణించారు. ఇది సిమ్చాట్ తోరా యొక్క పవిత్రమైన యూదుల సెలవుదినం సందర్భంగా దాడులకు తెగబడ్డారని గిలోన్ మండిపడ్డారు. పాలస్తీనా ఉగ్రవాద దాడులను తిప్పికొట్టడానికి ఇజ్రాయెల్ పోరాడుతోందన్నారు. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్‌లోని నగరాలు, గ్రామాలలో ప్రశాంతంగా నిద్రపోతున్న మన పౌరులపై హమాస్ దాడులకు పాల్పడిందన్నారు. 
* గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఆస్తులపై వైమానిక దళం దాడుల ఫుటేజీని IDF ప్రచురించింది.  IAF జెట్‌లు ఇప్పటి వరకు 16 టన్నుల కంటే ఎక్కువ ఆయుధాలను పాలస్తీనాపై జారవిడిచాయి.      
* ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్ టెర్రర్ గ్రూప్ భారీ దాడి తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధంలో ఉందని ప్రకటించారు. పాలస్తీనా మూల్యం చెల్లించుకుంటుందని Xలో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపారు. పాలస్తీనాతో యుద్దంలో ఇజ్రాయెల్ గెలుస్తుందని ధీమా అన్నారు. శత్రువులు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. గాజా ఆధారిత టెర్రర్ గ్రూప్ దాడి ప్రారంభించిన ఐదు గంటల తర్వాత అతని బలమైన ప్రకటనలు వచ్చాయి.