ఉత్తర కొరియా.. దేశాన్ని పాలిస్తుంది నియంత కాకపోయినప్పటికీ ఆయన పరిపాలన విధానం మాత్రం నియంత పాలన లాగే అనిపిస్తుంది. ఉత్తర కొరియాలో ఉన్న ఆంక్షలు చూస్తే ప్రపంచ దేశాలు అన్ని ఆశ్చర్యపోతాయి. చివరికి తినడానికి మంచి తిండి ఉండదు.కట్టడానికి మంచి బట్ట ఉండదు. కానీ ఆంక్షలకు మాత్రం కొదవ లేదు. సినిమాలు చూడకూడదు. వార్తలు చూడకూడదు..ఇంటర్నెట్ వాడకూడదు. ఇది ఉత్తర కొరియా దుస్థితి. దీంతో విసిగి పోయిన ప్రజలు వారి దేశం కట్టుబట్లును కాదు అనుకుని పక్క దేశాలకు వెళ్లి శరణు కోరతారు.
అలాంటిది ఓ అమెరికా సైనికుడు ఉత్తర కొరియాకు శరణార్థిగా వెళ్లాడు. దీని గురించి మొట్టమొదటి సారిగా ఉత్తర కొరియా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికా సైనికుడు అయిన ట్రావిస్ టి.కింగ్ సరిహద్దులు దాటి ఉత్తర కొరియాలోకి ప్రవేశించి తమ దేశాన్ని శరణు కోరడానికి గల కారణాలను కూడా ఉత్తర కొరియా వెల్లడించింది. అమెరికా సైన్యంలోని అమానవీయ ప్రవర్తన, జాతి వివక్ష కారణంగానే అతను సరిహద్దులు దాటినట్లు ట్రవిస్ చెప్పాడని వివరించింది.
ఈ మేరకు ఉత్తర కొరియా తొలిసారి అమెరికా సైనికుడి గురించి అధికారిక ప్రకటన వెలువరించింది. ట్రవిస్ కావాలనే ఉత్తర కొరియాకు వచ్చినట్లు ప్యాంగ్ యాంగ్ దర్యాప్తు బృందాలు కూడా తెలిపాయి. ట్రవిస్ అనే అమెరికా సైనికుడు సైన్యంలో ఎన్నో అవమానకర పరిస్థితులను ఎదుర్కొవడంతో పాటు కొన్ని అమానవీయ ఘటనలు కూడా చవి చూసినట్లు అతను చెప్పినట్లు ఉత్తర కొరియా వివరించింది.
ట్రవిస్ ఉత్తర కొరియాతో పాటు మరేదైనా దేశంలో శరణార్థిగా ఉండటానికి కూడా రెడీ గా ఉన్నట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. ఈ విషయం గురించి ఉత్తర కొరియా ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది మాత్రం వెల్లడించలేదు. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికా సైనికుడిని ఉత్తర కొరియా శిక్షిస్తుందా లేదా అనే దాని మీద ఎలాంటి స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. గత నెల 18న ట్రావిస్ అనే అమెరికా సైనికుడు కొంతమంది సైనికులతో కలిసి అమెరికా ఉత్తర కొరియా సంయుక్త గస్తీ ప్రాంతానికి చేరుకొని అక్కడ నుంచి ఉత్తర కొరియాకు పారిపోయాడు.
ట్రవిస్ ను ఉత్తర కొరియా నుంచి అమెరికాకు తీసుకుని రావడానికి ఐరాస కమాండ్ సాయంతో అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పెంటగాన్ అధికారి ఒకరు మాట్లాడుతూ..వీలైనంత త్వరగా ట్రవిస్ ను ఉత్తర కొరియా నుంచి ఇంటికి క్షేమంగా చేరుస్తామని వివరించారు.