Nobel Peace Prize 2025:నార్వే నోబెల్ కమిటీ 2025 నోబెల్ శాంతి బహుమతిని మారియా కారినా మచాడోకు ఇచ్చింది. వెనిజువెలా ప్రజల హక్కుల కోసం డిక్టేటర్‌షిప్‌నకు వ్యతిరేకంగా న్యాయమైన, శాంతియుత పోరాటానికి గుర్తుగా ఈ పురస్కారం లభించింది.  

Continues below advertisement


దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, ప్రజల ప్రజాస్వామిక హక్కుల పునరుద్ధరణ కోసం నిరంతరం పోరాడుతున్న ప్రముఖ ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. నార్వేజియన్ నోబెల్ కమిటీ చేసిన ఈ ప్రకటన యావత్ లాటిన్ అమెరికాలోని ప్రజాస్వామిక పోరాటాలకు గొప్ప ప్రేరణగా నిలిచింది. ప్రజాస్వామ్యం నుంచి నియంతృత్వానికి జరుగుతున్న పరివర్తనలో న్యాయమైన, శాంతియుత మార్పు కోసం ఆమె చూపిన నిబద్ధత, ఆమె పోరాట స్ఫూర్తిని గుర్తిస్తూ ఈ చారిత్రాత్మక గౌరవాన్ని ప్రకటించారు.


ఐరన్ లేడీ: 


ఒక ఇంజనీర్‌గా ప్రజాజీవితాన్ని మొదలు పెట్టిన మారియా కొరినా మచాడో నిరంకుశత్వానికి సవాలు విసిరారు. 58 ఏళ్ల మారియా కొరినా మచాడో కేవలం రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు. వెనిజులాలో ప్రజాస్వామ్యం పట్ల ఆమెకున్న అపారమైన నిబద్ధత కారణంగా ఆమె దేశ రాజకీయాల్లో "వెనిజులా ఐరన్ లేడీ"గా సుస్థిర స్థానాన్ని సంపాదించారు. 


మచాడో రాజకీయ ప్రయాణం 2002లో స్టార్ట్ అయ్యింది. ఆ సంవత్సరంలో ఆమె "సూమతే" (Súmate) అనే ఎన్నికల పర్యవేక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆమె నికోలస్ మడురో పాలనకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె రాజకీయాలలోకి వచ్చిన దశాబ్దకాలంలోనే ప్రజల మద్దతు కూడగట్టారు. 2010లో ఆమె రికార్డు స్థాయి ఓట్లతో జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా ఎన్నికై, 2011 నుంచి 2014 మధ్యకాలంలో వెనిజులా జాతీయ అసెంబ్లీలో ఉన్నారు. 2012 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు.


క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే మచాడోకు ఉన్న ప్రత్యేకత. 2023లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం లభించింది. ఏకంగా 92% ఓట్లతో ప్రతిపక్షాల తరఫున అధ్యక్ష అభ్యర్థిగా గెలుపొందారు. అయితే, నిరంకుశ పాలన ఆమెకు వచ్చిన ప్రజాదరణ చూసి వణికిపోయింది. అంతే కుట్రలు మొదలయ్యాయి. 2023లోనే కంట్రోలర్ జనరల్ ద్వారా మచాడోను 15 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హురాలిగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని 2024 జనవరిలో సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దీంతో 2024 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. అక్కడితో ఆగిపోలేదు. ఆమె దేశంలో కూడా ఉండేందుకు అర్హురాలు కాదని కూడా నిషేధం విధించారు.  


ఇన్ని వేధింపులు వస్తున్నప్పటికీ మచాడో తన పంథాను వదులుకోలేదు. పోరాటంలో వెనక్కి తగ్గలేదు. తన తరఫున ఎడ్ముండో గొంజాలెజ్‌ఉర్రుటియాను ప్రతిపక్షాల తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీకి పెట్టారు. అయితే పరిస్థితిని ముందే గమనించిన మడురో 28 జులై, 2024లో తన విజయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇది చెల్లదని ప్రతిపక్షాలు ఆందోళనబాట పట్టాయి. 
 
ఆ తర్వాత మచాడో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎన్ని నిర్బంధాలు ఉన్నా ఎన్ని విధాలుగా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిన తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు మచాడో. అందుకే ఆమెకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. నిర్బంధంలో కూడా వెనక్కి తగ్గని స్వభావానికి ప్రపంచ అత్యున్నత పురస్కారం వరించింది. ప్రజల కోసం పలు మార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. మడురో పాలన వెనుజులాకు మాత్రమే కాకుండా దానికి ఆనుకొని ఉన్న అన్ని దేశాలకు పెను ముప్పుగా ఆమె అభివర్ణిస్తూ వచ్చారు. అయితే ఎప్పుడు కూడా ఆమె ప్రపంచ దేశాల మద్ధతు కోరలేదు. కానీ ప్రజాస్వామ్య పాలన కోసం పని చేయాలని మాత్రమే కోరుతున్నారు. ఏ ప్రజాస్వామ్య దేశానికైనా తమ నిర్ణయాలు తాము తీసుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉండాలని కోరుతుంటున్నారు.   


నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ముందే ఆమెకు చాలా అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. కౌన్సిల్ ఆఫ్ యూరప్ 2024లో వాక్లవ్ హావెల్ మానవ హక్కుల పురస్కారం ఇచ్చింది. అదే ఏడాది సఖరోవ్ బహుమతిని ఎడ్ముండో గొంజాలెజ్‌తో కలిసి అందుకున్నారు. 2019లో లిబరల్ ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ ప్రైజ్ దక్కింది. 2018లో  బీబీసీ ప్రకటించిన 100 అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. 


నోబెల్ బహుమతికి మచాడోను ఎవరు నామినేట్ చేశారు?


మచాడో నోబెల్ శాంతి బహుమతికి ఇన్‌స్పిరా అమెరికా పౌండేషన్ నామినేట్ చేసింది. నాలుగు యూనివర్శిటీల రెక్టర్లతో కలిసి 2024 ఆగస్టు 16న నామినేట్ చేసింది. ఫ్లోరిడా నుంచి యూఎస్‌ లెజిస్లేటర్లు దీనికి మద్ధతు ప్రకటిస్తూ ఆగస్టు 26న లేఖ రాశారు.