అఫ్గానిస్థాన్‌లో కల్లోల పరిస్థితుల వేళ కాబుల్ ఎయిర్‌పోర్టు లక్ష్యంగా మరో ఉగ్ర దాడి జరిగే అవకాశం మెండుగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. మరో 24 నుంచి 36 గంటల వ్యవధిలో ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉందని కాబట్టి కాబుల్ ఎయిర్ పోర్టును పౌరులంతా ఖాళీ చేయాలని బైడెన్ సూచించారు. అఫ్గానిస్థాన్‌లో ఇటీవల పేలుళ్లకు కారణమైన ఐసిస్-కే ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా అమెరికా ప్రతీకార డ్రోన్ దాడులు జరిగిన కొద్ది గంటలకే జో బైడెన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. శనివారం (స్థానిక కాలమానం) జో బైడెన్ వైట్ హౌజ్‌లో విలేకరులతో మాట్లాడారు.
‘‘అఫ్గానిస్థాన్‌లో క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరీ ప్రమాదకరంగా తయారవుతోంది. కాబుల్ ఎయిర్ పోర్టు వద్ద టెర్రరిస్టు దాడుల అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వచ్చే 24 నుంచి 36 గంటల్లో ఉగ్ర దాడి జరగవచ్చని మా సైన్యం నుంచి విశ్వసనీయ సమాచారం ఉంది.’’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.
అంతేకాక, కాబుల్‌లోని అమెరికన్ ఎంబసీ కూడా ఆదివారం ఉదయం ఈ హెచ్చరిక జారీ చేసింది. కాబుల్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో బాంబు దాడి జరగొచ్చని విశ్వసనీయ సమాచారం ఉందని, కాబట్టి పౌరులందరూ కాబుల్ ఎయిర్ పోర్టు పరిసరాలను ఖాళీ చేసి దూరంగా వెళ్లిపోవాలని సూచించింది. ‘‘బాంబు దాడికి సంబంధించి కచ్చితమైన, విశ్వసనీయ సమాచారం ఉన్నందువల్ల అమెరికా పౌరులు కాబుల్ ఎయిర్ పోర్టులోని సౌత్ గేట్ సహా వాయువ్యం వైపు ఉన్న పంజ్ షీర్ పెట్రోల్ పంపు, ఇతర పరిసరాల నుంచి తక్షణమే వెళ్లిపోవాలి.’’ అని అఫ్గాన్‌లోని అమెరికన్ ఎంబసీ ప్రకటన విడుదల చేసింది.
గురువారం సాయంత్రం కాబుల్ విమానాశ్రయంలో ఐసిస్-కే జరిపిన దాడుల్లో 180 మందికిపైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. వారిలో 13 మంది అమెరికా రక్షణ సిబ్బంది ఉన్నారు. అయితే, ఉగ్రవాదుల స్థావరాలపై డ్రోన్ దాడులను ఇంతటితో ఆపబోమని, మరిన్ని దాడులు చేస్తామని ఐసిస్-కే ఉగ్రవాదులకు బైడెన్ హెచ్చరిక చేశారు. తమ పౌరుల ప్రాణాలను బలిగొన్న ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద తమ సైనికుల మరణాలకు ప్రతీకారంగా అమెరికా దాడికి దిగిన విషయం తెలిసిందే. అఫ్గానిస్థాన్‌లో నంగహర్ ప్రావిన్స్‌లో ఇస్లామిక్ స్టేట్-ఖోరసాన్ స్థావరాలపై శుక్రవారం మానవ రహిత డ్రోన్లతో దాడులు నిర్వహించింది. ఇందులో ఆత్మాహుతి దాడికి సూత్రధారి సహా మరో ఉగ్రవాది హతమైనట్టు అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది.
Also Read: Gold-Silver Price: పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో మరింతగా.. తాజా ధరలు ఇలా..
Also Read: Afghanistan Drone Attack: కాబుల్ పేలుళ్లపై అమెరికా ప్రతీకారం.. ఆ శిబిరాలపై యూఎస్ డ్రోన్ దాడులు