నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై అసలు అడుగే పెట్టలేదా..?
ఆర్టెమిస్ 1 ప్రయోగం రెండు సార్లు వాయిదావేసిన నాసా
సాంకేతిక కారణాలే సాకుగా చూపిస్తున్న అమెరికన్ స్పేస్ ఏజెన్సీ
మళ్లీ వెలుగులోకి వస్తున్న యాభై ఏళ్ల నాటి ఆరోపణలు
అపోలో మిషన్లన్నీ ఫేక్ అంటూ అప్పట్లో రచ్చ రచ్చ
జీవితాంతం నాసా పై పోరాటం చేసిన బిల్ కేసింగ్
నాసా సినిమా తీసిందన్న ఫ్లాట్ ఎర్త్ సొసైటీ
స్టాన్లీ క్యూబ్రిక్ డైరక్షన్ లో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ యాక్ట్ చేశారా


యాభై ఏళ్ల కిందటే చంద్రుడిపైకి మనుషులను పంపిన నాసాను ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇరకాటంలో పడేస్తున్నాయి. ఎందుకంటే 1969-72 మధ్య కాలంలో అపోలో ప్రాజెక్ట్ ద్వారా నాసా చంద్రుడిపైకి మనుషులను పంపించి ఆ తర్వాత నిలిపివేసింది. ఆ తర్వాత ఇప్పటివరకూ ఏ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ కూడా తమ మనుషులను చంద్రుడిపైకి పంపించలేదు. అప్పటి సోవియట్ యూనియన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇండియన్ స్పేస్ ఏజెన్సీ, చైనా స్పేస్ ఏజెన్సీ చంద్రుడిపైన ప్రయోగాలను చేశాయి కానీ మనుషులను దింపలేదు. కనుక నాసాకు ఇప్పుడు ఎదురవుతున్న ఈ టెక్నికల్ ప్రాబ్లం వాళ్ల పాత ప్రయోగాలపైనా ప్రభావం చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అప్పట్లో సోవియట్ యూనియన్ నుంచి స్పేస్ ప్రోగ్రామ్స్ లో ఎదురవుతున్న విపరీతమైన పోటీ తట్టుకోలేక నాసా చంద్రుడిపైకి మనుషులను పంపిచామని కట్టుకథలు అల్లిందంటూ కూడా అనేక కుట్రకోణాల కథలు ప్రచారంలో ఉన్నాయి.


చందమామపై మనిషి ఓ అందమైన అబద్ధం :
చంద్రుడిపైకి నాసా మనుషులను పంపించలేదని.. అదంతా అబద్ధమని తొలిసారి వాదన రేపిన వ్యక్తి పేరు బిల్ కేసింగ్. ఈయన యూఎస్ నేవీ ఆఫీసర్ పనిచేసేవారు. ఇంగ్లీషులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. 1976 బిల్ కే సింగ్ రాసిన ఓ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. అదే We never Went to the Moon : America's Thirty Billion Dollar Swindle. రాకెట్స్ మీద కానీ టెక్నికల్ రైటింగ్ మీద కానీ అసలే మాత్రం నాలెడ్జ్ లేని బిల్ కేసింగ్ ను 1956 లో రాకెట్ డైన్ అనే కంపెనీ సీనియర్ టెక్నికల్ రైటర్‌గా తీసుకుంది. ఆ తర్వాత ఆ రాకెట్ డైన్ కంపెనీ నాసా శాటర్న్ 5 రాకెట్ కు ఎఫ్ 1 ఇంజిన్స్ తో తయారు చేయటంతో బిల్ కేసింగ్ నాసా అఫీషియల్స్ తోనూ కలిసి పనిచేశారు. అప్పుడే నాసాలో జరుగుతున్న అనేక అంతర్గత విషయాలు బిల్ కేసింగ్ దృష్టి కి వచ్చాయి. 


1963 వరకూ రాకెట్ డైన్ కంపెనీ ప్రొపల్షన్ ఫీల్డ్ ల్యాబొరేటరీకి సంబంధించి టెక్నికల్ పబ్లికేషన్స్ కు బిల్ కేసింగ్ హెడ్ గా వ్యవహరించారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. చంద్రుడిపైకి మనుషులను 1969 లో పంపించామని నాసా చెప్పినదంతా అబద్ధమంటూ బిల్ కేసింగ్ రాసిన ఓ పుస్తకాన్ని ఆయనే అచ్చు వేసుకుని 1976 లో ప్రజల ముందుకు తీసుకువచ్చారు. అప్పటివరకూ అసలు వివాదమే లేని ఈ అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. చంద్రుడి మీద మనుషులను అడుగుపెట్టేలా చేశామంటూ నాసా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇచ్చిన ఫ్రూవ్స్ అన్నీ ఫేక్ అంటూ తన పుస్తకంలో ఆరోపణలు చేశారు బిల్ కేసింగ్.


తను బయటపెట్టిన సంచలన ఆరోపణలతో తన తండ్రిని, కుటుంబాన్ని చంపేందుకు ఫెడరల్ ఏజెన్సీస్ ప్రయత్నిస్తున్నాయని కూడా అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. సైన్స్ అడ్వాన్స్ మెంట్ ను అడ్డుకునేలా ఈ పుస్తకం ఉందని కొంత మంది ఆరోపిస్తే మరికొంత మంది మాత్రం బిల్ కేసింగ్ కు మద్దతుగా నిలిచారు. ఈ పుస్తకం ఎడిషన్స్ మూడు సార్లు రీ ప్రింట్ అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. ఎంత మంది ఫస్ట్ మూన్ ల్యాండింగ్ ను ఎంత మంది హోక్స్ థియరీ అని బలంగా నమ్మారో. 2005లో చనిపోయేంతవరకూ బిల్ కేసింగ్ తన వాదనను వినిపిస్తూనే ఉన్నాడు. 


స్టాన్లీ క్యూబ్రిక్ డైరెక్షన్ లో చంద్రుడి సినిమా షూట్ : 
1980 లో ఫ్లాట్ ఎర్త్ సొసైటీ కూడా నాసా చంద్రుడి మీద ల్యాండింగ్స్ ను ఫేక్ అంటూ ఆరోపణలు చేసింది. ఆర్థర్ సీ క్లార్క్ రాసిన స్క్రిప్ట్ తో అప్పట్లో టాప్ డైరెక్టర్ స్టాన్లీ క్యూబ్రిక్ దర్శకత్వంలో చంద్రుడి మీద మనుషులు దిగారనే వీడియో షూట్ చేయించారని..ఆరు అపోలో మిషన్లలకూ ఇలాంటి షూటింగ్ లే జరిగాయని వాటినే నిజమైన వీడియోలుగా ప్రజలను నమ్మించారని ఫ్లాట్ ఎర్త్ సొసైటీ సంచలన ఆరోపణలు చేసింది. అప్పటికే స్టాన్లీ క్యూబ్రిక్ 2001: A Space Odyssey(1968) లో వాడిన అద్భుతమైన గ్రాఫిక్స్ ప్రపంచాన్ని నివ్వెర పరిచాయి. సో అలాంటి గ్రాఫిక్స్ ఉన్న సినిమా తీసిన వ్యక్తి ఫస్ట్ మూన్ ల్యాండింగ్ ఎపిసోడ్ ను అవలీలగా తీసేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 


అప్పటి స్పేస్ కింగ్ సోవియట్ యూనియన్ :
1957 లో సోవియట్ యూనియన్ స్పుత్నిక్ 1, స్పుత్నిక్ 2 లతో అంతరిక్షంలోకి తొలిసారిగా అడుగుపెట్టిన దేశంగా రికార్డులకెక్కింది. 1958 లో నాసా ఏర్పడింది. మే 1961 నాటికి అలెన్ షెపర్డ్ ను స్పేస్ లోకి పంపించగలిగింది నాసా. అప్పుడే అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నడీ ఓ భీకరమైన స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ దశాబ్దం ముగిసే లోపే నాసా చంద్రుడిపైకి మనుషులను పంపించి తిరిగి సేఫ్ గా భూమి మీదకు తీసుకువస్తుందని. ఫలితంగా యూఎస్ ఫెడరల్ బడ్జెట్‌లో నాలుగు శాతం నిధులు నాసాకే వెళ్లేవి. అయినా సోవియట్ యూనియనే చాలా 'తొలి రికార్డు'లను సొంతం చేసుకునేది. ఫస్ట్ ఉమెన్ ఇన్ స్పేస్ 1963, ఫస్ట్ ఎక్స్ ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ దట్ ఈజ్ స్పేస్ వాక్ 1965 ఇలా నాసా కు అందనంత దూరంలో ఉంది సోవియట్ యూనియన్. 


అదే సమయంలో అమెరికా ప్రయోగించిన అపోలో 1 లాంచ్ ప్యాడ్ ఫైర్ అయ్యి ముగ్గురు ఆస్ట్రోనాట్లు చనిపోవటంతో నాసా పై న ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. ఫలితంగా 1969 లో చంద్రుడిపైకి అపోలోను సక్సెస్ ఫుల్ గా పంపించామని.. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగు పెట్టిన తొలి మనిషని నాసా వీడియోలు, ఫోటోలు విడుదల చేసిందని.. అవన్నీ ఫేక్ అని ప్రధాన ఆరోపణ. ఫోటోలు, వీడియోల్లోనూ చాలా తప్పులు కనిపెట్టారు. సరిగ్గా ఆ ప్రదేశంలోనే లైటింగ్ ఉండటం, వెనుక ఆకాశంలో నక్షత్రాలు లేకపోవటం, పాతిన అమెరికా జెండా వాతావరణం లేని చోట ఊగుతుంది అనటం, వైజర్ లో క్లియర్ గా కనిపిస్తున్న ఎదుటి మనిషి రిఫ్లైక్షన్స్ అండ్ లైట్స్, ఆస్ట్రోనాట్ల నీడలు అబ్బో ఇలా ప్రతీ ఫ్రేమ్ ను మాస్టర్ చేసి ఫేక్ మూన్ ల్యాండింగ్ అంటూ అనేక వీడియోలు విడుదలయ్యాయి. 


53 ఏళ్లు దాటినా నేటికి ఆరోపణలు :
ఇప్పుడు ఆర్టెమిస్ 1 రాకెట్‌ను చంద్రుడి మీదకు పంపటానికి రెండు సార్లు పోస్ట్ పోన్ అవగానే ఈ కాన్ స్పిరసీ థియరీలు అన్నీ మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ పత్రికలైన గార్డియన్ ప్రచురించిన వార్తలు, ఫాక్స్ న్యూస్ డాక్యుమెంటరీస్ అన్నీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ అన్ని వేళ్లూ నాసా వైపే చూపిస్తున్నాయి. గోల్డెన్ రికార్డ్స్ తో ఇంటర్ స్టెల్లార్ స్పేస్ లోకి వోయేజర్స్ పంపి, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తో సూర్యకుటుంబం బయటి గ్రహాలను, గెలాక్సీలను జల్లెడ పట్టి, పర్ సివరెన్స్ రోవర్ తో మార్స్ పైన తిరిగేస్తున్న నాసా రోవర్లు.. ఇలా కళ్ల ముందే నాసా తాలుకూ వైభవం ఇంత కనపడుతున్నప్పుడు ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం ఆరోపణలతో నాసా కృష్టిని తప్పు పట్టలేం కానీ.. ఇన్నేళ్లవుతున్నా వాటిని తిప్పికొట్టగలిగేలా నాసా సమాధానం ఇవ్వకపోవటం.. లాజిక్ కు అందని కొన్ని ప్రశ్నలు. ఇప్పుడు ఇదుగో ఇలా ఆదిలోనే హంసపాదులా చిన్న చిన్న ప్రయోగాలకు చేస్తున్న తాత్సారం అన్నీ నాసా పై ఒత్తిడిని పెంచేవే అని చెప్పటమే అసలు ఉద్దేశం.