Bangladesh PM Sheikh Hasina:
అంతర్జాతీయ మద్దతు కోసం..
రోహింగ్యాల విషయంలో బంగ్లాదేశ్ అసహనంగా ఉన్నట్టు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. 10 లక్షలకు పైగా రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్‌కు వలస వచ్చారు. అక్కడే నివసిస్తున్నారు. అయితే...వాళ్లు తమ సొంత దేశానికి వెళ్లిపోయేలా చొరవ చూపించేందుకు అంతర్జాతీయ మద్దతుని కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు బంగ్లా ప్రధాని షేక్ హసీనా. త్వరలోనే ఆమె భారత్ పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలోనే రోహింగ్యాలు తమ దేశానికి వెళ్లిపోవటానికి అవసరమైన సహకారం అందించాలని భారత్‌ను కోరనున్నారు. భారత్ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందని ఆమె భావిస్తున్నారు. ANI న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు షేక్ హసీనా.
నేరాలు పెరుగుతున్నాయ్..
"మాకు రోహింగ్యాలు చాలా భారంగా తయారయ్యారు. భారత్ చాలా పెద్ద దేశం. అక్కడ ఎంతో మంది రోహింగ్యాలకు ఆశ్రయం దొరుకుతుంది. కానీ...మా చిన్న దేశంలోనే 10 లక్షలకుపైగా రోహింగ్యాలు ఆశ్రయం పొందుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి అంతర్జాతీయ మద్దతుని కూడగట్టే పనిలో ఉన్నాం. పొరుగు దేశాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. రోహింగ్యాలు తమ సొంత దేశానికి వెళ్లిపోయేలా అన్ని దేశాలూ సహకరించాలని కోరుతున్నాం" అని ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటికే తమ ప్రభుత్వం రోహింగ్యాల కోసం ఎంతో చేసిందని, మయన్మార్ నుంచి వచ్చి తల దాచుకుంటున్నందుకు మానవతా దృక్పథంతో ఆదుకున్నామని చెప్పారు. "మానవత్వంతో ఆలోచించి వారికి అన్ని వసతులూ కల్పిస్తున్నాం. కొవిడ్ సంక్షోభంలోనూ రోహింగ్యాలకు టీకాలు అందించాం. కానీ...ఇంకెంత కాలం ఇలా ఇక్కడే ఉండిపోతారు.? క్యాంప్‌ల్లో ఉంటున్నారు. ఇక్కడ వాతావరణ పరిస్థితులు సరిగ్గా ఉండవు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. వారిలో కొందరు డ్రగ్ ట్రాఫికింగ్, విమెన్ ట్రాఫికింగ్ లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకీ ఇలాంటి నేరాలు పెరిగిపోతున్నాయి. వీలైనంత త్వరగా వాళ్లు తమ దేశానికి వెళ్లిపోవటం మంచిది. ఇందుకోసమే పొరుగు దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితితోనూ మాట్లాడుతున్నాం" అని స్పష్టం చేశారు. వాళ్లు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవటం తమకు గౌరవంగానే ఉన్నప్పటికీ..వాళ్లను భరించే స్తోమత లేదని వెల్లడించారు.
తీస్తా నది వివాదం..
తీస్తా నది నీళ్ల పంపకానికి సంబంధించిన వివాదంపైనా ఆమె స్పందించారు. ఇదెంతో సవాళ్లతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. "మేము పల్లపు ప్రాంతంలో ఉన్నాం. భారత్ నుంచి నీళ్లు మా దేశానికి వస్తున్నాయి. ఈ విషయంలో భారత్ కాస్త పెద్ద మనసుతో ఆలోచించాలి. రెండు దేశాలూ ఈ నీళ్లతో లబ్ధి పొందుతున్నాయి. కొన్ని సార్లు అక్కడి నుంచి నీరు అందక మా దేశంలో ప్రజలు అల్లాడిపోయారు. వ్యవసాయానికీ ఇబ్బందులు ఎదురయ్యాయి. భారత ప్రధాని ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ వివాదం తప్పకుండా ముగిసిపోవాలి" అని అన్నారు. గంగా నది నీళ్లనూ రెండు దేశాలు పంచుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. కేవలం గంగానది నీళ్లే కాకుండా మిగతా నదుల నీళ్లనూ వినియోగించుకునేలా చొరవ చూపించాలని కోరారు.