Srilanka News : శ్రీలంకలో జరిగిన ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి నుంచి అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగిన జనతా విముక్తి పెరమున పార్టీ అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే,.. ఆ దేశ 9వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి  శ్రీలంక పీఠంపై అధిష్ఠించడం ఇదే తొలిసారి. నవీన శ్రీలంక నిర్మాణమే ధ్యేయంగా కృషి చేస్తానని గెలిచిన అనంతరం దిసనాయకే ప్రకటించారు.


శ్రీలంక చరిత్రలో రెండో ప్రాధాన్యత ఓట్లతో నెగ్గిన తొలి అధ్యక్షుడు:


2022లో అప్పటి అధ్యక్షుడు రాజపక్ష దేశాన్ని విడిచి పోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవికాగా.. శనివారం నాటి ఎలక్షన్స్‌లో కోటీ 70 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. తొలి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరికీ 50 శాతం మింటి ఓట్లు రాకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లలో దిసనాయకే విజయం సాధించారు. తొలిసారి శ్రీలంకలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించి అధ్యక్షుడి ఎన్నికను ప్రకటించారు. అంతే కాకుండా వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి శ్రీలంక పీఠంపై ఎక్కనుండడం కూడా ఇదే తొలిసారి. దేశ చరిత్రలోనే ఇవే అత్యంత శాంతియుతంగా జరిగిన ఎన్నికలుగా శ్రీలక ఎన్నికల సంఘం ప్రకటించింది.


శ్రీలంకలో నాటి రాజపక్ష సర్కారు విపరీతమైన అవినీతికి పాల్పడి దేశ ప్రజల ధిక్కారానికి గురికాగా.. కఠినమైన అవినీతి నిరోధక చర్యలు తీసుకుంటామంటూ దిసనాయకే చేసిన ప్రసంగాలు, వాగ్దానాలు లంకేయుల్లోకి బలంగా వెళ్లాయని అవి ఓట్ల రూపంలో కనిపించాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సుపరిపాలనే తన లక్ష్యమని చెప్పిన దిసనాయకే.. సంక్షోభ సంయంలో సంస్థాగతమైన మార్పులే లక్ష్యంగా దిసనాయకే చెప్పిన మాటలు ఓటర్ల మెప్పు పొందాయని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఫలితాల వెల్లడి కాక ముందు నుంచే ఆయనకు అభినందనల వెల్లువ వచ్చి పడింది. ఆయన ప్రధాన ప్రత్యర్థులైన విక్రమసింఘే, ప్రేమదాస మద్దతుదారులు ఈ అభినందన సందేశాలు పంపించారు.


కొత్త అధ్యక్షుడి ముందు ఎన్నోసవాళ్లు:


దిసనాయకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అనేక సవాళ్లు ఎదురు కానున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం సహా ఆర్థిక మాంద్యాన్ని పారదోలి లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేయడం ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. రాజపక్షపై తిరుగుబాటుకు కారణం ఆర్థిక మాంద్యమే కాగా.. దాన్ని కట్టడి చేయడానికి దిసనాయకే ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని లంకేయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆహారం, మెడిసిన్ వంటి నిత్యావసరాలు కూడా ప్రజలకు దూరం కాగా.. కీలకమైన విధాన లోపాలు సరిదిద్దడం సహా దేశ ఎక్స్‌పోర్ట్స్ పెరిగేలా చర్యలు తీసూకోవడం ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి. టూరిజం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంపై దిసనాయకే దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టిన దిసనాయకే.. శతాబ్దాలుగా కన్న కలలు ఇప్పుడే సాకారం దిశగా అడుగులు పడ్డాయని.. దీని కోసం కొన్ని లక్షల మంది ప్రాణ త్యాగాలు చేశారన్న దిసనాయకే.. వారి త్యాగాలు వృథా కావన్నారు. సుపరిపాలన అందించి లంక ప్రజల సమస్యలు తొలగించడమే తన ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. అందరం కలిసి కొత్త చరిత్ర రాద్దామంటూ దేశ ప్రజలకు కొత్త అధ్యక్షుడు పిలుపునిచ్చారు.              





శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన దిసనాయకేకు భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. మోదీతో పాటు వివిధ దేశాధినేతలు కూడా అభినందనలు చెప్పారు.


Also Read: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ