PM Narendra Modi arrived at Greenville Delaware | వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. తన తన మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం డెలావేర్‌లోని గ్రీన్‌విల్లే చేరుకున్నారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఆరో క్వాడ్ సదస్సులో భారత ప్రధాని పాల్గొననున్నారు. ఫిలడెల్ఫియా నుంచి డెలావేర్‌కు చేరుకున్న అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం బైడెన్ నివాసంలో ఈ ఇద్దరు అగ్రనేతలు ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. ఈ కీలక భేటీలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై, చైనా అంశంపై సైతం వీరు చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బైడెన్, మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లోని యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్ నివాసంలో జరిగే క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొంటారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరగనున్న 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'లో నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. అమెరికా చేరుకున్న అనంతరం ప్రధాని మోదీ ఎక్స్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు.  ‘ఫిలడెల్ఫియాలో అద్భుతమైన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయుల ఆత్మీయ స్వాగతం, వారి ఆశీస్సులు ఎంతో విలువైనవి’ అని ప్రధాని రాసుకొచ్చారు.






ఇండో పసిఫిక్ రీజియన్‌లో డ్రాగన్ దేశం చైనాను కట్టడి చేయడం సహా ఆ ప్రాంతంలోని దేశాల ప్రయోజనాలు కాపాడమే లక్ష్యంగా క్వాడ్ సదస్సు జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సొంత నగరమైన డెలావేర్ లోని విల్మింగ్‌టన్‌లో క్వాడ్ దేశాధినేతల 6వ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ క్వాడ్ సదస్సులో జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాధినేతలతో భారత ప్రధాని సంప్రదింపులు జరపనున్నారు.  


క్వాడ్ సదస్సు ముగిసిన తర్వాత సెప్టెంబరు 22న లాంగ్ ఐలాండ్‌లో ప్రవాస భారతీయులతో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత ప్రధాని మోదీ న్యూయార్క్ వెళ్లనున్నారు. అనంతరం సోమవారం (సెప్టెంబర్ 23న) UN జనరల్ అసెంబ్లీలో 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'లో నరేంద్ర మోదీ పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారని తెలిసిందే. 


Also Read: 58 మంది లవర్స్ - రోజూ అదే పని - చైనాలో మహిళా గవర్నర్‌కు 13 ఏళ్ల జైలు శిక్ష