Marlene Schiappa: ఫ్రెంచ్ మంత్రి మార్లిన్ షియప్పా (Marlene Schiappa) ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించి ఆ దేశంలో సంచలనం సృష్టించారు. ఫ్రాన్స్‌లోని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి చెందిన మహిళా మంత్రి ప్లేబాయ్ మ్యాగజైన్ ముఖచిత్రానికి పోజులివ్వడం వివాదానికి దారితీసింది. మాక్రన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పదవీ విరమణ వయస్సు పెంపు ప్రణాళికలపై ఒకవైపు భారీ ప్రదర్శనలు జరుగుతుండగా.. తాజాగా మార్లిన్ షియప్పా వ్యవహారం ప్రతిపక్షాల్లో ఆగ్రహం కలిగిస్తోంది. 40 ఏళ్ల మార్లిన్ స్త్రీవాద రచయిత్రి కూడా. మాక్రన్ ప్రభుత్వంలో 2017 నుంచి మంత్రిగా చేస్తున్నారు. అయితే ప్లేబాయ్ పత్రికపై ఆమె ఫోటో ప్రచురణ కావడంతో అక్కడి అతివాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తన చర్యను సమర్థించుకున్న మంత్రి
ఫ్రాన్స్ ప్రభుత్వంలో సోషల్ ఎకానమీ, అసోసియేషన్స్ శాఖ నిర్వహిస్తున్న మార్లిన్ షియప్పా ఇటీవల ప్లేబాయ్ పత్రికకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ గ్లామర్ పత్రికలో ఫొటో షూట్ కోసం ప్రత్యేకంగా డిజైనర్ దుస్తులు ధరించారు. ప్లేబాయ్ పత్రిక కవర్‌పేజీపై ఫోటో మాత్రమే కాకుండా.. ఆ పత్రికకు ఆమె 12 పేజీల ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. మహిళా, గే, అబార్షన్ హక్కుల (abortion rights) గురించి ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. మరోవైపు.. బోల్డ్ చిత్రాలకు పేరొందిన ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజీపై తన ఫొటోను మార్లిన్ షియప్పా సమర్థించుకున్నారు. ఆడవారు తమ శరీరాలతో ఏమైనా చేయవచ్చు అన్న హక్కుల్ని డిఫెండ్ చేస్తున్నట్టు ఆమె చెప్పారు. ఫ్రాన్స్‌లో మహిళలు స్వేచ్ఛగా ఉంటారని, ఆ పద్ధతి ఎవర్ని ఇబ్బందిపెట్టినా ఇక్కడ అదే శైలి ఉంటుందని ఆమె తన ట్విట్టర్‌లో రాసుకున్నారు. "మహిళలు తమ శరీరాలతో వారు కోరుకున్నది చేయగలరు. మేము ప్రతిచోటా, అన్ని సమయాలలో మా హక్కులను కాపాడుకోవాలి" అని మార్లిన్ ట్వీట్ చేశారు.
ఇంటా బయటా నిరసనలు
ఆమె వస్త్రధారణ తప్పుడు సంకేతాలను పంపిస్తుందని విమర్శకులు అంటున్నారు. ఈ ఫొటోపై స్పందించిన ఫ్రాన్స్ ప్రధాని ఎలిసాబెత్ బోర్నే (Élisabeth Borne).. మార్లీనెను పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చేసిన పని సరైంది కాదు’’ అని మంత్రికి ప్రధాని చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇక ఫ్రాన్స్ ఎంపీ రూసో మాట్లాడుతూ.. ‘‘ఫ్రాన్స్ ప్రజలకు గౌరవం ఎక్కడుంది..? ప్రజలు మరో రెండేళ్లు అదనంగా పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. తినడానికి తిండిలేదు.. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. మహిళల శరీర ప్రదర్శనకు సమస్య లేదు. కానీ, దానికి సామాజిక కోణం ఉండాలి, కానీ మార్లిన్ చేసిన పని సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతుంది’’ అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వానికి కొత్త తలనొప్పి
ఫ్రాన్స్ ప్రభుత్వం దేశంలో పదవీ విరమణ వయస్సును పెంచింది, దీనికి వ్యతిరేకంగా గత 3 నెలలుగా దేశవ్యాప్తంగా విస్తృత నిరసనలు జరుగుతున్నాయి. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తన ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ, ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న సవాళ్లతో సతమతమవుతున్నారు. అటువంటి సమయంలో, తన ప్రభుత్వంలో మహిళా మంత్రి ఫొటో 'ప్లేబాయ్సలో ప్రచురితం కావడం ఆయనకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వంలోని కొందరు మార్లిన్‌కు అనుకూలంగా ఉండగా, చాలా మంది మిత్రపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.