Global Sugar Prices: ప్రపంచంలోని చాలా దేశాలు దాదాపు ఒక సంవత్సర కాలంగా ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ సంక్షోభ బాధితులు అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాలు మాత్రమే కాదు, అనేక పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా ఆహార నిల్వల కోసం అల్లాడిపోతున్నాయి. తీపిని పంచాల్సిన పంచదార చేదుగా మారడం కూడా ఈ సంక్షోభానికి ఒక సంకేతంగా విశ్లేషకులు చెబుతున్నారు. చక్కెర కొరత వల్ల ఆహార సంక్షోభం మరింత బలపడుతుందన్న భయం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కువైంది.
ధరల్లో తేడాతో ప్రాసెసింగ్ కంపెనీలకు లాభం
బ్లూంబెర్గ్ వార్తల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా తెల్ల చక్కెర (వైట్ షుగర్) ఫ్యూచర్స్ ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. దీని వల్ల, ముడి చక్కెరపై (బెల్లం లేదా ఖండ్) ప్రీమియం ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. లండన్‌లో అత్యంత యాక్టివ్ కాంట్రాక్ట్ అయిన వైట్ షుగర్ 0.2 శాతం పెరిగింది, న్యూయార్క్‌లో ముడి చక్కెర ఫ్యూచర్స్ 0.7 శాతం తగ్గాయి. ఈ రెండింటి మధ్య గ్యాప్ సెప్టెంబర్ 2022 నుంచి విస్తృతంగా ఉంది. ఈ కారణంగా ప్రాసెసింగ్ కంపెనీలు ఎక్కువ లాభాలను కళ్లజూస్తున్నాయి. అవి, ముడి చక్కెరను తక్కువ ధరకు కొని, ప్రాసెస్ చేసిన తర్వాత తెల్ల చక్కెరను ఎక్కువ ధర వద్ద అమ్ముతున్నాయి.
దిగుబడి తగ్గడానికి చాలా కారణాలు
చాలా దేశాల్లో, చెరకు దిగుబడులు జాతీయ అంచనా కంటే దారుణంగా ఉన్నాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో, డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక కొనుగోలుదార్లు ఇబ్బందులు పడుతున్నారు. థాయ్‌లాండ్‌లో తక్కువ ఎరువుల వాడకం, భారతదేశంలో అధిక వర్షపాతం, ఐరోపా, మెక్సికో, చైనాలోని కొన్ని ప్రాంతాల్లో కరవు.. ఇలా వివిధ దేశాల్లో వేర్వేరు కారణాల వల్ల చెరకు దిగుబడులు అంచనాల కంటే తగ్గాయి. దీని ఫలితంగా చక్కెర సరఫరాపై పడింది. చక్కర సరఫరా ఇప్పటికే తగ్గింది, ఇంకా తగ్గే అవకాశం ఉంది.
ఇప్పటికే కనిపిస్తున్న సంక్షోభ సంకేతాలు
ప్రపంచంలో చెరకు ఉత్పత్తిలో థాయిలాండ్ నాలుగో అతి పెద్ద దేశం. థాయ్ షుగర్ మిల్లర్స్ కార్పొరేషన్‌ను ఉటంకిస్తూ, థాయ్‌లాండ్‌లోని 57 అతి పెద్ద మిల్లర్లలో 5 మిల్లర్లు చెరకు క్రషింగ్‌ను ఇప్పటికే నిలిపివేశారని, తక్కువ దిగుబడి వల్ల కార్యకలాపాలు ఆపేశాయన్న వార్తలు వెలువడ్డాయి. ఈజిప్ట్, అల్జీరియా దేశాలు కూడా తమ మార్కెట్ల నుంచి చక్కెర ఎగుమతులను అడ్డుకోవడానికి అనేక చర్యలు తీసుకున్నాయి.
బ్రెజిల్ నుండి ఉపశమనం లభించకపోవచ్చు
బ్రెజిల్‌ను గ్లోబల్ షుగర్ బౌల్‌గా చెబుతారు. కానీ, ఈసారి బ్రెజిల్ నుంచి ప్రపంచ మార్కెట్‌కు ఉపశమనం లభించకపోవచ్చు. బ్రెజిల్ నుంచి సరఫరా తగ్గుతుందని బ్లూంబెర్గ్ నివేదిక ద్వారా తెలుస్తోంది. ముడి చక్కెర విషయంలో బ్రెజిల్ అతి పెద్ద సరఫరాదారు కావచ్చు గానీ, శుద్ధి చేసిన చక్కెర (తెల్ల చక్కెర) ఉత్పత్తి అక్కడ చాలా తక్కువగా ఉంది.
దేశీయ మార్కెట్‌లో చక్కెర నిల్వలను అందుబాటులో ఉంచడానికి, ధరలు పెరగకుండా చూడడానికి మన దేశం కూడా చాలా చర్యలు తీసుకుంది. చక్కెర ఎగుమతుల మీద గతంలోనే పరిమితులు విధించింది.
ప్రపంచ చక్కెర సంక్షోభంతో, భారతీయ చక్కెర కంపెనీల షేర్‌హోల్డర్లకు కలిసి రావచ్చు. అయితే, ఇది నిత్యావసర వస్తువు కాబట్టి కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ కూడా ఎక్కువగానే ఉంటుంది.