Cell Phones Recovery : చోరీకి గురైన, పోగొట్టుకున్న 170 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి శనివారం ఆ ఫోన్లను బాధితులకు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లాలో సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధితుల కోసం చాట్ బాట్( CHAT BOT) సేవలను ప్రారంభించామని ఎస్పీ తెలిపారు. ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ల మిస్సింగ్ కేసులు ఎక్కువైనందున, పోగొట్టుకున్న మొబైల్స్ ను బాధితులకు అందజేసేందుకు  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా మిస్సింగ్ మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేస్తున్నామన్నారు.  


మొత్తం 220 ఫోన్స్ రికవరీ 


మొదటి విడత "CHAT BOT" సేవలు ప్రారంభించిన అనతి కాలంలోనే సుమారు రూ. 22,30,500/- విలువ చేసే 120 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు వారి ఫోన్లను అందజేశామని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. రెండో విడత గా సుమారు 28 రోజుల వ్యవధిలోనే "CHAT BOT" సేవల ద్వారా సుమారు రూ.36,00,000/- విలువ చేసే 170 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి చేతికందడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. "CHAT BOT" సేవలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు Rs.58,30,500/- విలువ చేసే 220 మొబైల్ ఫోన్స్ ను రికవరీ చేసి బాధితులకు అందజేశామని ఎస్పీ తెలిపారు. 


దొరికిన ఫోన్ వాడుకోవద్దు 


ఫోన్ చోరీకి గురైనా, మిస్ అయిన వారు “CHAT BOT" సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. వాట్సాప్ నంబర్ 9493206459కు HI లేదా HELP అని మెసేజీ పంపాలన్నారు.  ఇలాంటి సేవలతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం పరుచుకొని పోగొట్టుకున్న మొబైల్స్ ను పొందవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఎవరికైనా సెల్ ఫోన్ దొరికితే సొంతానికి వాడుకోవడం కానీ, గుర్తు తెలియని వ్యక్తులు ద్వారా బిల్లులు లేని సెల్ ఫోన్ లను కొనడం కాని చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు. మీకు దొరికిన సెల్ ఫోన్ లను దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్ కి అందజేయాలని కోరుతున్నారు. 


"సెల్ ఫోన్ రికవరీ కోసం చాట్ బాట్ సేవలు ప్రారంభించాం. గతంలో 500 ఫిర్యాదులు వచ్చాయి. వాటిల్లో మాగ్జిమన్ ట్రేస్ చేసి రికవరీ చేసి ఓనర్స్ కి తిరిగి ఇచ్చాం. మళ్లీ 500 కంప్లైంట్స్ వచ్చాయి. వాటిని కూడా ఎనలైజ్ చేసి చాలా వరకు సెల్ ఫోన్లను రికవరీ చేశాం.  170 మొబైల్స్ రికవరీ చేసి ఓనర్స్ తిరిగి ఇచ్చాం. రూ.50 లక్షల విలువైన ఫోన్లను రికవరీ చేసి వాటిని ఓనర్స్ కు తిరిగి ఇచ్చాం. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ ట్రేసింగ్ టీమ్ ను ఫామ్ చేశాం. వీళ్లు రెగ్యులర్ గా ఇదే పనిలో ఉండి మొబైల్స్ ట్రేస్ చేసి ఇస్తున్నాం." - ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి