Best Small Saving Scheme: 2023 ఏప్రిల్ - జూన్ త్రైమాసికానికి, కొన్ని 'చిన్న మొత్తాల పొదుపు పథకాలపై' వడ్డీ రేటును (Small Saving Schemes Interest Rates) కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఓవరాల్‌గా చూస్తే.. 10 నుంచి 70 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను కేంద్రం పెంచింది. వడ్డీ రేటు పెంపును అందుకున్న చిన్న పొదుపు పథకాలు... సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC), సుకన్య సమృద్ధి యోజన (SSY), మంత్లీ ఇన్కమ్ సేవింగ్ స్కీమ్ (MISC), కిసాన్ వికాస్ పత్ర (KVP) సహా మరికొన్ని ఉన్నాయి. అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మీద వడ్డీని మాత్రం కేంద్ర ప్రభుత్వం పెంచలేదు.
ప్రస్తుతం PPF మీద చెల్లిస్తున్న వడ్డీ సంవత్సరానికి 7.1%. గత రెండు త్రైమాసికాలుగా ఇదే రేటు కొనసాగుతోంది. మరోవైపు, ఐదేళ్ల కాల డిపాజిట్లపై వడ్డీ 7.7 శాతంగా ఉంది. సుకన్య సమృద్ధి యోజన వడ్డీని 8 శాతానికి, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై వడ్డీ రేటును 8.2 శాతానికి కేంద్రం పెంచింది. ఈ పథకాలతో పోలిస్తే, PPFలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ డబ్బును మీరు సంపాదించవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, ఉత్తమ పెట్టుబడి ఎంపికల్లో ఒకటి. ఇందులో, పెట్టుబడిదార్లు ఒకేసారి డబ్బు మొత్తాన్ని (One Time) డిపాజిట్ చేయవచ్చు, వాయిదాలలో రూపంలోనూ డిపాజిట్ చేయడానికి అనుమతి ఉంది. వాయిదాల రూపంలో డిపాజిట్ చేయాలంటే... ఒక ఆర్థిక సంవత్సరానికి 12 సార్లకు మించకుండా మాత్రమే డిపాజిట్ చేయాలి. అంటే.. SIP (Systematic Investment Plan) లాగా ప్రతి నెలా కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు.
1-4 తేదీలు చాలా ముఖ్యం
PPFలో మీరు ఇప్పటికే పెట్టుబడి పెడుతున్నా, పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నా 1-4 తేదీలను కచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ పథకంలో 1వ తేదీ నుంచి 4వ తేదీ మధ్య మాత్రమే పెట్టుబడి పెట్టమని ఆర్థిక నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే, ఆ తేదీల్లో ఉన్న మొత్తంపైనే ఆ నెల వడ్డీని లెక్కగట్టి, ఖాతాకు జోడిస్తారు.
PPF ద్వారా ఎక్కువ లాభం ఎలా పొందాలి?
పబ్లిక్ ప్రావిడెంట్ పథకం 15 సంవత్సరాల కాల గడువుతో (మెచ్యూరిటీ గడువు) ఉంటుంది. ఈ పథకంలో 1-4 తేదీలను మిస్సవ్వకుండా, 15 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా పెట్టుబడిని కొనసాగిస్తూ వెళితే పెడితే, ఇతర పథకాల కంటే ఎక్కువ మొత్తం పొందే ఆస్కారం ఉంది.
PPF పెట్టుబడులకు ఆదాయ పన్ను మినహాయింపు
PPF ఖాతాను ప్రారంభించడం చాలా సులభం. ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ లేదా ప్రైవేట్ రంగ బ్యాంక్‌లోనైనా PPF అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. పోస్టాఫీసులో కూడా ఈ ఖాతాను ప్రారంభించి, పెట్టుబడిని స్టార్ట్ చేయవచ్చు. ఇందులో, ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. PPFలో పెట్టుబడి పెట్టే మొత్తాలకు ఆదాయ పన్ను చట్ట ప్రకారం మినహాయింపు లభిస్తుంది.