Senior Citizen Savings Scheme: కొత్త ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రారంభంతో, చిన్న పొదుపు పథకాల్లో (Small Saving Schemes) కొన్ని పెద్ద మార్పులను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటిలో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌ ఒకటి. ఈ పథకం కింద పెట్టుబడి పెట్టే వ్యక్తులకు శుభవార్త అందిస్తూ, వడ్డీ రేట్లను (SCSS Interest Rate Hike) పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పెంచిన రేటు, 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు అమలు అవుతుంది. 


SCSS పెట్టుబడి పరిమితి రెట్టింపు               
ఇదే స్కీమ్‌కు సంబంధించి, 2023-24 బడ్జెట్‌ ప్రకటన సమయంలోనూ సీనియర్ సిటిజన్‌లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో పెట్టుబడి పరిమితిని ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఇప్పుడు, ఏప్రిల్ 1, 2023 నుంచి సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో రెట్టింపు పెట్టుబడి పెట్టవచ్చు.


ఒక ఉద్యోగి పదవీ విరమణ తర్వాత, అతనికి వచ్చే జీతం ఆదాయం ఆగిపోయినప్పటికీ, ఇంటి ఖర్చులు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి, బలమైన రాబడిని ఇచ్చే సురక్షితమైన పెట్టుబడి మార్గం కోసం సీనియర్ సిటిజన్లు వెదుకుతుంటారు. అలాంటి సురక్షిత మార్గాల్లో ఒకటి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌. ఇది, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే చిన్న మొత్తాల పొదుపు పథకం. కాబట్టి ఇది సురక్షితమైన పెట్టుబడి ఎంపిక. దీనిలో పెట్టుబడి పరిమితిని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. గతంలో ఈ పథకంలో పెట్టుబడి గరిష్ట పరిమితి రూ. 15 లక్షలు కాగా, ఇప్పుడు దాన్ని రూ. 30 లక్షలకు పెంచింది. పెట్టుబడి పరిమితిని పెంచిన తర్వాత, పెట్టుబడిదార్లు కూడా అధిక మొత్తంలో రాబడి ప్రయోజనాన్ని (SCSS Benefits) పొందుతారు.


SCSS వడ్డీ రేటు పెంపు              
దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు, గత ఆర్థిక సంవత్సరంలో (2022-23‌), రిజర్వ్ బ్యాంక్ మొత్తం 250 బేసిస్ పాయింట్ల (2.5%) మేర రెపో రేటును పెంచింది. దీంతో బ్యాంకుల డిపాజిట్ రేట్లపై ప్రభావం పడింది. ఈ పరిస్థితుల్లో చిన్న మొత్తాల పొదుపు పథకాలను ఆకర్షణీయంగా మార్చేందుకు, వాటిపై చెల్లించే వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీంతో, 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు (Senior Citizen Savings Scheme interest rate) 8.20 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2023 జనవరి-మార్చి కాలం) ఇది 8.00 శాతంగా ఉంది. ఇప్పుడు, 20 బేసిస్ పాయింట్లు లేదా 0.20% పెరిగింది.


SCSS వివరాలు:      
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి కనీస వయస్సు 60 సంవత్సరాలు
మీరు ఈ పథకంలో 5 సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు
ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు రాయితీ పొందవచ్చు
ఈ పథకం కింద బ్యాంక్‌లోనే కాకుండా పోస్టాఫీసులో కూడా ఖాతా తెరవవచ్చు