Mahila Samman Savings Certificate: ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమర్పిస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కోసం ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించారు. ఆ పథకం పేరు "మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్" (Mahila Samman Savings Certificate Scheme). ఈ పథకం ప్రారంభానికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏప్రిల్ 1, 2023 నుంచి పథకం ప్రారంభం
మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్, కొత్త ఆర్థిక సంవత్సరం (2023-24) నుంచి, అంటే ఏప్రిల్ 1, 2023 నుంచి ప్రారంభం అయింది. ఇప్పుడు, ఈ పథకం ప్రయోజనాన్ని మహిళలు పొందవచ్చు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం కాల పరిమితి (మెచ్యూరిటీ) రెండేళ్లు. డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకం వివరాలను పరిశీలిస్తే.. మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకాన్ని మహిళలు, బాలికల కోసం తీసుకొచ్చారు. అంటే, పురుషులకు ఈ పథకంలో పెట్టుబడికి అవకాశం లేదు. ఖాతాదారు మైనర్ అయితే, బాలిక పేరుతో సంరక్షకుడు ఖాతా తెరవాల్సి ఉంటుంది.
ఇది రెండేళ్ల కాల గడువు ఉన్న పథకం కాబట్టి, ఒక మహిళ లేదా మైనర్ బాలిక పేరు మీద ఖాతాను తెరవడానికి 2025 మార్చి 31వ తేదీ వరకు అవకాశం ఉంది.
రూ.1000-రూ.2 లక్షల డిపాజిట్
కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ఖాతాలో కనీసం రూ. 1,000 నుండి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంలో, ఖాతాదారు సింగిల్ అకౌంట్‌హౌల్డర్ అయి ఉండాలి, ఉమ్మడి ఖాతా తెరవడానికి వీలు ఉండదు. పథకం ద్వారా పెట్టుబడిదార్లకు సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ ఇస్తారని చెప్పుకున్నాం కదా, ప్రతి త్రైమాసికం తర్వాత ఈ వడ్డీ మొత్తాన్ని ఖాతాకు బదిలీ చేస్తారు.
ఈ పథకంలో పెట్టుబడికి రెండేళ్ల మెచ్యూరిటీ తర్వాత, ఫారం-2ను పూరించిన తర్వాత ఖాతాదారుకి సంబంధిత మొత్తం ఇస్తారు. ఖాతాదారు మైనర్ అయితే, ఫారం-3ని పూరించిన తర్వాత గార్డియన్ ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. పథకం కొనసాగుతున్న సమయంలో, ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, ఖాతాలో ఉన్న డబ్బులో 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
రెండేళ్ల మెచ్యూరిటీకి ముందే మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ఖాతాను మూసివేయడం కుదరదు. అయితే, నిబంధనలో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఖాతా ప్రారంభించిన తర్వాత ఖాతాదారు మరణించినా, తీవ్ర అనారోగ్యంతో ఉన్నా లేదా మైనర్ ఖాతా సంరక్షకుడు మరణించినా, ఆ ఖాతాను కొనసాగించడం తమకు ఆర్థికంగా సాధ్యం కాదని నిరూపించినా.. ఇలాంటి సందర్భాల్లో బ్యాంక్ లేదా పోస్టాఫీసు అంగీకరిస్తే ఆ ఖాతాను మూసివేయవచ్చు. అది కూడా, ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత మాత్రమే ఇందుకు అవకాశం ఉంటుంది.