Small Savings Schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో (Small Savings Schemes) డబ్బు జమ చేసే సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సుకన్య సమృద్ధి యోజన, జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం (NSC), కిసాన్ వికాస్ పత్ర (KVP), పోస్టాఫీసు డిపాజిట్ పథకాలు మరియు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లకు వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయని తెలిపింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ పొదుపు పథకం, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలపై కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సవరిస్తుంది. ఈ నేపథ్యంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై చెల్లించే వడ్డీ రేట్లను పెంచుతూ జరిగిన సమీక్షలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించి వడ్డీ రేట్లను సవరించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం సవరించింది. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేటును 10 నుంచి 70 బేసిస్ పాయింట్లు పెంచింది. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో సీనియర్ సిటిజన్ల పొదుపు పథకాలు, సుకన్య సమృద్ది యోజన వంటి పథకాలు వడ్డీ రేట్లు మారతాయి. అయితే, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, సాధారణ సేవింగ్స్ డిపాజిట్ వడ్డీ రేట్లలో ఆర్థిక శాఖ ఎలాంటి మార్పులు ప్రకటించలేదు.
తాజా నిర్ణయంతో సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 7.6 శాతం నుంచి 8 శాతానికి పెరిగింది. నెలవారీ ఆదాయ ఖాతాపై వడ్డీ ఇప్పుడు 7.1 శాతం నుంచి 7.4 శాతానికి, కిసాన్ వికాస్ పత్రపై 7.2 శాతం నుంచి 7.5 శాతానికి పెరిగింది. ఇకపై సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టే వారికి 8 శాతానికి బదులుగా 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం గత రెండు త్రైమాసికాలుగా పెంచుతూ వస్తోంది. చివరిసారి, 2022 డిసెంబర్ 30న, స్మాల్ సేవింగ్స్ పథకాలపై వడ్డీ రేట్లను 20 నుంచి 110 బేసిస్ పాయింట్ల వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పెంచింది. అయితే.. వాటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) సుకన్య సమృద్ధి యోజన ( Sukanya Samridhi Yojana) మీద వడ్డీ రేట్లను పెంచలేదు. గత 9 నెలల్లో కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచడం ఇది మూడోసారి.
టైమ్ డిపాజిట్లపైనా పెరిగిన వడ్డీ రేట్లు
ఒకటి, రెండు, మూడు, ఐదేళ్ల కాల వ్యవధి డిపాజిట్లపై కూడా కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు ఒక సంవత్సర కాల పరిమితి డిపాజిట్లపై 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఇప్పటి వరకు అది 6.6 శాతంగా ఉండేది. రెండేళ్ల కాల పరిమితి డిపాజిట్లపై ఇప్పటివరకూ 6.8శాతం ఉన్న వడ్డీ రేటును 6.9 శాతానికి పెంచారు. అదే విధంగా మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీని 6.9 శాతం నుంచి 7.0 శాతానికి పెంచారు. పెట్టుబడిదారులు ఇప్పుడు 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్లపై 7 శాతానికి బదులుగా 7.5 శాతం వడ్డీని పొందుతారు.