Rules Change From April 2023: శనివారం నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24 ప్రారంభం అవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో, ఆర్థిక సంబంధమైన చాలా విషయాలు కూడా మారుతున్నాయి. ఇవి నేరుగా మన జేబు మీద ప్రభావం చూపే అంశాలు. వీటి గురించి ముందే అహగాహన పెంచుకుంటే నష్టపోకుండా ఉంటాం.


ఏప్రిల్ 1 నుంచి ఏడు నిబంధనలు మారనున్నాయి. ఏ నియమాలు మారుతున్నాయి, మన జేబుపై వాటి ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకుందాం.


మొదటిది... ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పులు
బడ్జెట్ 2023లో ప్రకటించిన ఆదాయపు పన్ను సంబంధిత మార్పులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. పన్నుకు సంబంధించి అతి పెద్ద మార్పు.. కొత్త పన్ను విధానంలో ఆదాయ పరిమితి 5 లక్షలకు బదులుగా 7 లక్షల రూపాయలకు పెరుగుతుంది.


రెండోది... LTA  
లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఎన్‌క్యాష్‌మెంట్‌ (LTA) రూ. 3 లక్షలకు బదులుగా రూ. 25 లక్షలకు పెరుగుతుంది. దీంతో పాటు, జీవిత బీమా కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం ఇస్తే, దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


మూడోది... మార్కెట్ లింక్డ్ డిబెంచర్లలో పెట్టుబడి 'స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను' పరిధిలోకి వస్తుంది. భౌతిక బంగారాన్ని ఎలక్ట్రానిక్ బంగారంగా మార్చుకుంటే మూలధన పన్ను ఉండదు.


నాలుగోది... డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై LTCG పన్ను ప్రయోజనం లభించదు
ఏప్రిల్ 1 నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై 'దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను' ప్రయోజనం రద్దవుతుంది. ఈక్విటీ మార్కెట్‌లో 35% కంటే తక్కువ పెట్టుబడులు ఉన్న డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లపై కూడా పన్ను విధిస్తారు. గతంలో ఇది మినహాయింపు వర్గంలో ఉంది.


ఐదోది... పోస్టాఫీసు పథకాల్లో మార్పులు
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెరుగుతుంది. నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడి పరిమితి రూ. 4.5 లక్షలకు బదులుగా రూ. 9 లక్షలు, జాయింట్ ఖాతా కింద పరిమితి రూ. 9 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెరుగుతుంది. ఈ రెండు పథకాలు ప్రజలకు సాధారణ ఆదాయాన్ని అందిస్తాయి.


ఆరోది.. NPS కొత్త నియమాలు 
KYC పత్రాలను అప్‌లోడ్ చేయడాన్ని 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ' తప్పనిసరి చేసింది. 1 ఏప్రిల్ 2023 నుంచి ఇది అమలులోకి వస్తుంది. NPS సభ్యులు డబ్బును విత్‌డ్రా చేయడానికి ఉపసంహరణ ఫారం, గుర్తింపు, చిరునామా రుజువు, బ్యాంక్ ఖాతా, PRAN కాపీ మొదలైనవాటిని అందించాల్సి ఉంటుంది.


ఆరోది... రెపో రేటు పెరగవచ్చు
2023-24 ఆర్థిక సంవత్సరంలో, రిజర్వ్ బ్యాంక్ మొదటి ద్రవ్య విధాన ప్రకటన ఏప్రిల్ 6న ఉంటుంది. రెపో రేటు మరోసారి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే, బ్యాంక్‌ వడ్డీ రేట్లు మరో దఫా పెరుగుతాయి.


ఏడోది... HUIDతోనే బంగారు ఆభరణాల విక్రయం
HUID అంటే హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్. ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఇది. HUID నంబర్‌ ఉండే బంగారు ఆభరణాలు, ఇతర బంగారు ఉత్పత్తులను భారతదేశంలోని అన్ని ఆభరణాల దుకాణాల్లో విక్రయించాల్సి ఉంటుంది.