Small Savings: చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో (Small Savings Schemes) డబ్బు జమ చేసే సామాన్య ప్రజల కోసం, మరికొన్ని గంటల తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త ప్రకటించే అవకాశం ఉంది.
2023-24 ఏప్రిల్ - జూన్ త్రైమాసికానికి, చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవాళ సమీక్షిస్తుంది. ఆయా పథకాలపై చెల్లించే వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి.
చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం గత రెండు త్రైమాసికాలుగా పెంచుతూ వస్తోంది. చివరిసారి, 2022 డిసెంబర్ 30న, స్మాల్ సేవింగ్స్ పథకాలపై వడ్డీ రేట్లను 20 నుంచి 110 బేసిస్ పాయింట్ల వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పెంచింది. అయితే.. వాటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) సుకన్య సమృద్ధి యోజన ( Sukanya Samridhi Yojana) మీద వడ్డీ రేట్లను పెంచలేదు.
2023 ఫిబ్రవరి 8న, RBI ద్రవ్య విధాన కమిటీ వరుసగా ఆరో సారి కూడా వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో, రెపో రేటు ఇప్పుడు 6.50 శాతానికి చేరుకుంది. ఏప్రిల్ 6న, వడ్డీ రేట్లకు సంబంధించి తన నిర్ణయాన్ని RBI మళ్లీ ప్రకటించబోతోంది, రెపో రేటును మళ్లీ పెంచవచ్చని నమ్ముతున్నారు. ఫిబ్రవరి నెలలో, భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం RBI టాలరెన్స్ బ్యాండ్ (6%) కంటే ఎక్కువగా 6.40%గా నమోదైంది. ద్రవ్యోల్బణం అదుపులో రాలేదు కాబట్టి, రెపో రేటు పెంపు తప్పనిసరి కానుంది. ఈ నేపథ్యంలో, చిన్న మొత్తాల పొదుపు పథకాలపై చెల్లించే వడ్డీ రేట్లను పెంచుతూ ఇవాళ జరిగే సమీక్షలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుత వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి
ప్రస్తుతం, సాధారణ పొదుపు ఖాతా మీద 4%, ఒక సంవత్సర కాల వ్యవధి డిపాజిట్ మీద 6.6%, రెండేళ్ల కాల వ్యవధి డిపాజిట్ మీద 6.8%, మూడేళ్ల కాల వ్యవధి డిపాజిట్ మీద 6.9%, ఐదేళ్ల కాల వ్యవధి డిపాజిట్ మీద 7.0% వడ్డీని చెల్లిస్తున్నారు. రికరింగ్ డిపాజిట్ విషయానికి వస్తే... ఐదేళ్ల కాలానికి 5.8% వడ్డీ ఇస్తున్నారు.
సీనియర్ సిటిజన్ సేమిగ్స్ స్కీమ్ (SCSS) మీద 8%, మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ స్కీమ్ (MIA) మీద 7.1%, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) మీద 7.0%, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతా మీద 7.1% వడ్డీ చెల్లిస్తున్నారు. 120 నెలల కాల గడువు ఉండే కిసాన్ వికాస్ పత్ర (KVP) స్కీమ్ మీద 7.1%, సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం మీద 7.6% వడ్డీ చెల్లిస్తున్నారు. గత రెండు త్రైమాసికాల్లోనూ PPF, SSY పథకాల వడ్డీ రేట్లు మారలేదు, పాత రేట్లనే కొనసాగించారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు 8.15 శాతానికి పెరిగింది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన మహిళ సమ్మాన్ డిపాజిట్ పథకంలో రెండేళ్ల డిపాజిట్లపై ఏటా 7.50 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ పొదుపు పథకాలతో పోలిస్తే, PPF, సుకన్య సమృద్ధి యోజనపై తక్కువ వడ్డీ అందుతోంది. కాబట్టి, ఇతర పొదుపు పథకాలతో పాటు PPF, SSY వడ్డీ రేట్లను కూడా ఇవాళ పెంచవచ్చు.