American Airlines: విమాన ప్రయాణం వేళ ప్రయాణికులు, సిబ్బంది మధ్య గొడవలు, ఒకరిపై ఒకరు మూత్ర విసర్జన చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు ఈమధ్యకాలంలో తరచూ వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ ప్రయాణికులు విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగగా.. అతడిని విమానం నుంచి దించేశారు. ఇప్పుడు ఈ వార్త కాస్త చర్చనీయాంశంగా మారింది.
ఓవర్ హెడ్ బిన్ లలో లగేజీ పెట్టుకోవడం గురించి వాగ్వాదం మొదలైంది. ఇద్దరు ప్రయాణికులు ఓవర్ హెడ్ బిన్ లలో తమ లగేజీలు ఉంచగా.. ఒక వ్యక్తి మాత్రం తనకు ఎదురైన అసౌకర్యం గురించి పదే పదే విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. దీంతో విమాన సిబ్బంది ఒకరు తనవైపు వేలు చూపిస్తూ కాస్త ఆగమని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ ప్రయాణికుడు.. నా వైపే వేలు చూపిస్తావా అంటూ వాగ్వాదాన్ని పెంచడంతో.. ఆ వ్యక్తిని విమాన సిబ్బంది విమానం నుంచి దించేసినట్లు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. అయితే ఆ వ్యక్తి నాలుగు పెద్ద సైజు బ్యాగులను ఓవర్ హెడ్ బిన్ లలో ఉంచినట్లు క్యాబిన్ క్రూ తెలిపారు.
కొన్నిరోజుల క్రితం తోటి ప్రయాణికుడిపై మూత్రవిసర్జన
అమెరికా ఎయిర్‌లైన్స్‌లో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు తన తోటి ప్యాసింజర్‌పై యూరినేట్ చేశాడు. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. AA292 American Airlines ఫ్లైట్‌లో ఈ సంఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. మార్చి 3వ తేదీన రాత్రి 9 గంటలకు బయల్దేరిన విమానం...మార్చి 4వ తేదీ రాత్రి 10 గంటలకు ల్యాండ్ అయింది. నిందితుడు అమెరికాలోని ఓ యూనివర్సిటీ విద్యార్థిగా గుర్తించారు. మద్యం మత్తులో స్నేహితుడిపైనే మూత్ర విసర్జన చేశాడు. ఎందుకిలా చేశావని పోలీసులు ప్రశ్నించగా "నాకు తెలియకుండానే అయిపోయింది" అని బదులిచ్చాడు. నిద్రలో ఉండగానే యూరిన్ లీక్ అయిందని, తన పక్కనే ఉన్న ప్రయాణికుడిపై పడిపోయినట్టు సిబ్బంది వెల్లడించింది. అయితే...ఈ తప్పు చేసినందుకు నిందితుడు క్షమాపణలు చెప్పినట్టు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేస్తే ఆ విద్యార్థి కెరీర్ పాడైపోతుందన్న ఉద్దేశంతో బాధితుడు ఫిర్యాదు చేయలేదు. అయితే అమెరికన్ ఎయిర్ లైన్స్ మాత్రం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. Air Traffic Control (ATC)కి ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు నిందితుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.