Burning Man Festival: అదో ఎడారి ప్రాంతం. ఎడారి కదా ఏదీ ఉండదనుకుంటే పొరపాటే. అక్కడ జరిగే పండగ ఎంతో ఫేమస్. ఆ పండగ కోసం దేశవిదేశాలకు చెందిన వారు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఆ ఎడారి ప్రాంతం పేరు బ్లాక్ రాక్ సిటీ. అమెరికా నెవడాలోని బ్లాక్ రాక్ సిటీ ఎడారి అది. అక్కడ ఏటా నిర్వహించే పండగే బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్. ఈ పండగ కోసం వేలాది మంది తరలివచ్చారు. నెవడాలోని బ్లాక్ రాక్ సిటీ ఎడారిలో ఆగస్టు 27వ తేదీన ఈ బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ ప్రారంభమైంది. 


పండగ రోజుల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేద్దామనుకుని వేలాది మంది దేశవిదేశాల నుంచి అక్కడికి తరలివచ్చారు. ఎంతో ఉత్సాహంగా ఆ పండగ జరుపుకోవాలని కోరుకున్నారు. పండగ ఆనందంలో గడపాల్సిన వారంతా అనుకోని పరిస్థితుల కారణంగా.. ప్రోగ్రాములు అన్నీ అప్ సెట్ అయిపోయి.. దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకు పోయారు. ఏకంగా 73 వేల మంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతగా అక్కడ ఏం జరిగింది.. 73 వేల మంది చిక్కుకుపోవడం ఏంటి అనుకుంటున్నారా.. అయితే ఈ వార్త పూర్తిగా చదవండి. 


అమెరికాలోని నెవడాలో నిర్వహించే బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ చాలా ఫేమస్. ఈ పండగ కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. నెవడాలోని బ్లాక్ రాక్ సిటీలోని ఎడారి ప్రాంతంలో ఆ ఫెస్టివల్ ను నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీన ఎంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేసేందుకు వేలాది మంది తరలివచ్చారు. అయితే ఉన్నట్టుండి ఆ ప్రాంతంలో వర్షం కురిసింది. ఎంతలా కురిసిందంటే.. మూడు నెలల్లో కురవాల్సిన వర్షం మొత్తం ఒక్క రాత్రిలోనే కురిసింది. దీంతో ఎడారిగా ఉండే ఆ ప్రాంతం అంతా తడిసి ముద్దయింది. అంతా బురదమయం అయిపోయింది.


ఈ భారీ వర్షానికి జరగాల్సిన ఈవెంట్లు అన్నీ రద్దయ్యాయి. ఫెస్టివల్ లో ఎంజాయ్ చేద్దామనుకున్న ప్లాన్ కాస్తా అట్టర్ ఫ్లాప్ కావడంతో.. ఇక అక్కడి నుంచి తిరిగి వెళ్లాలనుకున్నారు చాలా మంది. కానీ.. వారికి ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఎక్కడి వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి తెచ్చింది ఆ భారీ వాన. చుట్టూ బురదమయం కావడంతో అడుగు తీసి  అడుగు వేస్తే కాళ్లు కూరుకుపోతున్నాయి. పోనీ.. కార్లలో వెళ్దామంటే.. వాహనాల టైర్లు బురదలో చిక్కుకుపోతున్నాయి. ఇక చేసేది లేక అక్కడ ఉన్న వాళ్లు ఎటూ వెళ్లలేక దిక్కుతోచని స్థితిలో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి వల్ల అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. బయటి వారు లోపలికి రాకుండా బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ ను మూసేసింది. చుట్టూ కొన్ని మైళ్ల దూరం వరకు బురదే ఉంది. పొడిగా ఉన్న ప్రాంతాన్ని చూసుకునే అక్కడే ఉండాలని ఆ ఫెస్టివల్ కు వచ్చిన వారికి స్థానిక ప్రభుత్వం సూచించింది.