Libyan Flood: లిబియా డేనియల్ తుపాను సృష్టించిన విలయంలో మృతుల సంఖ్య 11,300 కు చేరుకుంది. మరో 10,100 మంది గల్లంతయ్యారు. ఈ భారీ విపత్తుతో తుడిచిపెట్టుకుపోయిన డెర్నా సిటీలో పరిస్థితి బీతావహంగా ఉంది. రోడ్లపై ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా శవాలే కనిపిస్తున్నాయి. వాహనాలు చల్లాచెదురుగా పడి ఉన్నాయి. సహాయక సిబ్బంది ఇప్పటి వరకూ 11వేలకు పైగా మృతదేహాలను వెలికితీశారు. 1,000 కి పైగా మృతదేహాలను గుర్తించి అంత్యక్రియలు నిర్వహించారు. జలప్రళయం ధాటికి 20వ శతాబ్దం మొదట్లో నిర్మించిన భవనాలు ధ్వంసం అయ్యాయి. ఈ డెర్నా సిటీలోకి ప్రవేశించకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. సహాయకక బృందాలు బురదలో, శిథిలమైన భవనాల్లో గల్లంతైన వారి కోసం వెతికే పనులకు అడ్డంకిగా ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకుంది అక్కడి సర్కారు. డెర్నీ సిటీలోని పౌరులను పూర్తిగా ఖాళీ చేయించనున్నారు. ఈ పట్టణంలోకి వెళ్లడానికి కేవలం రెస్క్యూ బృందాలను మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. 


వరదల తాకిడికి రెండు డ్యాములు కొట్టుకుపోయాయంటే జల విలయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డ్యాములు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత పోటెత్తిన వరద నీటిలో అనేకమంది మధ్యధరా సముద్రంలోకి కొట్టుకుపోయినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. డెర్నా నగరంలోనే ఎక్కువ నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. సముద్ర తీరంలోని పర్వత ప్రాంతంలో డెర్నా నగరం ఉంది. ఇక్కడ నివాస గృహాలు చాలా వరకు పర్వత లోయలో ఉన్నాయి. ఈ కారణంగా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. డ్యామ్‌ బద్దలు కావడంతో ఈ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోకి ఒక్కసారిగా భారీగా బురద నీరు చొచ్చుకొచ్చింది. ప్రజలు తప్పించుకునేందుకు  అవకాశం లేకుండా పోయింది. రోడ్లపై ఎటు చూసినా మృతదేహాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గుట్టలుగుట్టలుగా కొట్టుకొస్తున్నాయి. 


వాతావరణాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని లిబియా ఎమర్జెన్సీ అండ్‌ అంబులెన్స్‌ అథారిటీ ప్రకటించింది. సముద్ర మట్టం, వరద, గాలి వేగం వంటివి సరిగ్గా అధ్యయనం చేయలేదని, ఈ స్థాయి ముప్పును లిబియా గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదని అధికారులు తెలిపారు. తూర్పు తీరంలోని అల్‌ బైడ, అల్‌ మర్జ్‌, తుబ్రోక్‌, టాకెనిస్‌, బెంగ్‌హజి నగరాలు కూడా వరదలకు ప్రభావితం అయ్యాయి. అత్యంత ఘోర వినాశనాన్ని చూసిన డెర్నా నగరంలో దాదాపు 6,000 మంది తప్పిపోయారని లిబియా తూర్పు ప్రభుత్వ ఆరోగ్య మంత్రి ఒత్మాన్ అబ్దుల్‌జలీల్ వెల్లడించారు.


ఆరు మిలియన్లకుపైగా జనాభా కలిగిన లిబియా.. దశాబ్దానికిపైగా ఘర్షణలతో సతమతమవుతోంది. మౌలిక సదుపాయాల లేమితో బాధపడుతోంది. 2011లో నాటో మద్దతుతో కూడిన తిరుగుబాటు కారణంగా నియంత గడాఫీ మరణం తర్వాత లిబియా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.


సంవత్సరాల తరబడి లిబియా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అంతర్గత సంఘర్షణల వల్ల లిబియా ప్రభుత్వ సంస్థలు కావాల్సిన మేర పని చేయడం లేదు. దీని వల్ల విపత్తు నిర్వహణపై, విపత్తు రిస్క్ మేనేజ్‌మెంట్‌ పై పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టలేదు. దీంతో భారీగా నష్టం సంభవించినట్లు యూఎన్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ రిస్క్ నాలెడ్జ్ బ్రాంచ్ హెడ్ లోరీ హైబర్ గిరార్డెట్ తెలిపారు.