Baba Anujka: బాధ.. మనిషిని సైలెంట్ గా అయినా మారుస్తుంది. లేదా వయొలెంట్ గానైనా మారుస్తుంది. వారు ఎదుర్కొన్న పరిస్థితులు, సమస్యలు, కష్టాలు, బాధలు మనిషిని మార్చేస్తాయి. అయితే ఆ మార్పు మంచిదా, చెడ్డదా అనేది ఆ మనిషి పైనే ఆధారపడి ఉంటుంది. సమస్యల్ని, బాధల్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నవాళ్లు ఉన్నత స్థాయికి వెళ్తే.. వాటిని ఎదుర్కోలేనివారు పాతాళానికి పడిపోతుంటారు. బాధల్ని అధిగమించడానికి తప్పుడు దారిలోనూ వెళ్లే వాళ్లుంటారు. అలా.. ఓ అమ్మాయి తనకు 20 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి వల్ల కలిగిన బాధకు మొత్తం మగజాతిపైనే పగబట్టింది. ఆ బాధను పోగొట్టుకోవడానికి ఏకంగా 150 మందిని చంపేసింది. ఆ క్రిమినల్ లేడీ కథేమిటో ఇప్పుడు చూద్దామా..


ప్రేమ విఫలం.. భర్త మరణం 


అనడీ పిస్టోన్జా అలియాస్ బాబా అనుజ్కా.. ఈమె రొమేనియాలోని బనాట్ ప్రాంతంలో 1838లో ఒక ధనిక కుటుంబంలో జన్మించింది. అయితే ఆమె జీవితం ఎక్కువగా.. ప్రస్తుత సెర్బియాలోని వోయివోడినా ప్రావిన్స్‌లోని యుగోస్లేవియన్ గ్రామమైన వ్లాదిమిరోవాక్‌తో ముడిపడి ఉంది. ఆమె తండ్రి పశువులను పెంచేవాడు. అనుజ్కా బాల్యం అందరి ఆడపిల్లల్లాగే సంతోషంగా సాగిపోయింది. మంచి చదువులు చదివింది. కెమిస్ట్రీలో పట్టు సాధించింది. అయితే 20 ఏళ్ల వయసులో ఆమె మనసుకు తగిన దెబ్బ ఆమెను క్రిమినల్ గా మార్చేసింది. ఆమెకు సిఫిలిస్ ఇన్ ఫెక్షన్ అనే వ్యాధి ఉంది. దాని కారణంగా ఎంతో ప్రేమించిన ఒక ఆస్ట్రియన్ అధికారి ఆమెను వదిలేశాడు. దాంతో తీవ్రంగా కుంగిపోయిన అనుజ్కా కొన్నేళ్లపాటు అజ్ఞాతంలో గడిపింది. అనంతరం తనకంటే వయసులో ఎంతో పెద్దవాడైన, ఐదుగురు పిల్లలున్న ఓ భూస్వామిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన 20 ఏళ్ల తర్వాత ఆయన మరణించారు. ఆ పిల్లల్లో నలుగురు టీనేజీ రాకముందే చనిపోయారు. దీంతో మళ్లీ కుంగుబాటుకు గురైంది అనుజ్కా.


మ్యాజిక్ వాటర్


ముందు ప్రేమలో విఫలం. తర్వాత భర్త మరణం. అనంతరం పిల్లలు దూరమవడం. ఇలా అన్నీ కలిపి ఆమెను కఠినాత్మకంగా మార్చేశాయి. సీన్ కట్ చేస్తే.. కొన్నాళ్లల్లోనే పేరుమోసిన మంత్రగత్తెగా, స్థానిక వైద్యురాలిగా మారిపోయింది అనుజ్కా. ఆ రోజుల్లోనే లక్షల్లో సంపాదించింది. క్లయింట్ల కోసం ఏజెంట్లనే నియమించుకునే స్థాయికి చేరింది. వ్లాదిమిరోవాక్ గ్రామంలోని తన ఇంట్లో కెమికల్ ల్యాబ్ ఏర్పాటు చేసింది. తన కెమిస్ట్రీ పరిజ్ఞానంతో ఏవోవో ప్రయోగాలు చేసింది. కొన్నాళ్లకు ఒక విచిత్రమైన పదార్థాన్ని తయారుచేసింది. దాన్ని మ్యాజిక్ వాటర్ గా పిలిచేవారు. అదేంటో తెలుసా.. ఒక రకమైన విషం. దాని డోస్ తీవ్రతను బట్టి మనిషి 1 నుంచి 8 రోజుల్లో మరణిస్తాడు. డోస్ తక్కువగా తీసుకుంటే అనారోగ్యం పాలవుతాడు. 


చావుతో వ్యాపారం


ఆ మ్యాజిక్ వాటర్ తో అనుజ్కా ఎవరూ ఊహించని దారుణాలకు తెరతీసింది. అప్పట్లో యువకులు సైన్యంలో బలవంతంగా పనిచేయాల్సి వచ్చేది. అలాంటి వారికి ఆ వాటర్ ను తక్కువ డోసులో ఇచ్చి అనారోగ్యం పాలయ్యేలా చేసి వారు ఇంటికి వెళ్లేందుకు సహకరించేది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఒకప్పుడు తను పడ్డ బాధ ఆమెను రూట్ మార్చేలా చేసింది. తన భర్తలను చంపాలనుకునే భార్యలకు ఆ మ్యాజిక్ వాటర్ డోస్ పెంచి ఇవ్వడం ప్రారంభించింది. వాళ్లు భర్త తాగే నీళ్లల్లో, ఆహారంలో వాటిని కలిపి ఇచ్చేవాళ్లు. వారం రోజుల్లో వారి భర్తలు మరణించేవారు. ఎలా చనిపోయారనే విషయం ఎవరికీ అంతుబట్టేది కాదు. ఇలా తన వ్యాపారాన్ని మూడు డోసులు, ఆరు చావులుగా విస్తరించింది. కొద్ది కాలంలోనే ఆమె మ్యాజిక్ వాటర్ కు పాపులారిటీ పెరిగిపోయింది. 1920వ దశకంలో లాభసాటిగా వ్యాపారం సాగింది. విపరీతంగా డబ్బు వచ్చి పడింది. వాటర్ అవసరమైన వారిని వెతికి పట్టుకునేందుకు కన్సల్టెంట్లను నియమించుకుందంటే.. ఆమె చావు వ్యాపారం ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 


గుట్టు రట్టు


చేసిన పాపం ఎప్పటికైనా పండుతుందనే సామెత చందంగా అనుజ్కా మ్యాజిక్ వాటర్ గుట్టు రట్టయ్యే సంఘటన 1924లో జరిగింది. తన రెగ్యులర్ కస్టమరైన స్టానా మోమిరోవ్ తన భర్త లాజర్ లుడోస్కీని చంపడానికి మ్యాజిక్ వాటర్ తీసుకెళ్లింది. విజయవంతంగా పని పూర్తి చేసింది. మరొకరిని పెళ్లి చేసుకుంది. ఈసారి రెండో భర్త తండ్రికి టెండర్ పెట్టింది. ఆయనను చంపడానికి మళ్లీ మ్యాజిక్ వాటర్ ను ఉపయోగించింది. అయితే కొద్ది గ్యాప్ లోనే రెండు మరణాలు సంభవించటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా వారి చావులకు సంబంధించిన రహస్యం తేలలేదు. అయితే మరికొన్నాళ్లుకు మరో కుటుంబంలో ఇలాంటి మరణమే చోటుచేసుకోవటంతో.. గట్టిగా దృష్టిపెట్టిన పోలీసులు తమదైన రీతిలో ఇంటరాగేట్ చేయటంతో మ్యాజిక్ వాటర్ సీక్రెట్ తెలిసిపోయింది. 


నేర నిరూపణ.. 15 ఏళ్ల శిక్ష


పోలీసులు అన్ని ఆధారాలతో అనుజ్కా వద్దకు వెళ్లారు. అయితే ఆ మ్యాజిక్ వాటర్ గురించి తనకేమీ తెలియదని ఆమె బుకాయించింది. పోలీసులు ఊరుకుంటారా. ఆమె ల్యాబ్ లో దొరికిన వాటర్ శాంపిళ్లను, చనిపోయిన వారి శరీరంలో ఉన్న శాంపిళ్లను పరీక్షిస్తే రెండూ ఒకటేనని రూఢీ అయ్యింది. కోర్టులో నేర నిరూపణ అయ్యి అనుజ్కాకు 15 సంవత్సరాల శిక్ష పడింది. ఆ సమయంలో ఆమెకు 90 సంవత్సరాలు. వయసు పైబడిన కారణంగా శిక్షను 8 ఏళ్లకు కుదించారు. ఆ తర్వాత మరో రెండేళ్లు బ్రతికిన అనుజ్కా.. సరిగ్గా తన వందో సంవత్సరంలో వ్లాదిమిరోవాక్ లోని తన ఇంట్లోనే 1938 సెప్టెంబర్ 1 వ తేదీన మరణించింది. అయితే చరిత్రలోనే అత్యంత దారుణమైన సీరియల్ కిల్లర్ గా ఆమె నిలిచిపోయింది. 


ఇంతకీ... ఆమె మ్యాజిక్ వాటర్ బలైపోయిన పురుషుల సంఖ్య ఎంతో తెలుసా.. దాదాపు 150 మందికి పైగానే.