Amit Shah Eatala Meeting: రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా బిజీ బిజీగా గడుపుతున్నారు. తెలంగాణ విమోచన దినం ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు, ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం కావడంతో ఆయా కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కూడా షా పరామర్శించార. హైదరాబాద్ శామీర్ పేట్ లోని ఆయన నివాసానికి వెళ్లిన అమిత్ షా ఈటలను ఓదార్చారు. కేంద్ర హోం మంత్రితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఉన్నారు. ఇటీవల ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు హోంమంత్రి అమిత్ షా.. ఈటలను కలిసి పరామర్శించారు. దాదాపు 25 నిమిషాలపాటు ఈటల నివాసంలో అమిత్ షా ఉన్నారు. వెంట బండి సంజయ్ తోపాటు ఇతర నాయకులు ఉన్నారు. సుమారు 15 నిమిషాల పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఏకాంతంగా చర్చలు జరిపారు. 


ఈటలతో ఏకాంత చర్చలు..


తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, మునుగోడు ఉప ఎన్నికలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహ ప్రతి వ్యూహాలపై అమిత్ షా, ఈటల రాజేందర్ కలిసి చర్చించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరించాల్సిన తీరు, ఈ మధ్య అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేసిన విషయంపై కూడా అమిత్ షా ఈటలకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. 


15 నిమిషాలకుపైగా చర్చోపచర్చలు..


మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ మధ్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం, ఆ తర్వాత మునుగోడు ఉపఎన్నికపై రాజకీయం వాడి వేడిగా సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్లు రాజకీయం సాగుతోంది. విమర్శలు ప్రతి విమర్శలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈటల చాలా దూకుడుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్‌పైనే పోటీకి దిగుతానంటూ సవాలు విసిరారు. సీఎం కేసీఆర్ ఎక్కడ నిల్చుంటే.. అక్కడే తానూ పోటీకి నిలబడతానని పలు సందర్భాల్లో సవాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది. ఈ అన్ని పరిణామాలపై అమిత్ షా, ఈటల రాజేందర్ చర్చించినట్లు బీజేపీ సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 


చేరికలపై మార్గనిర్దేశం!


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటే ఉండగా.. వారిద్దరూ ఏకాంతంగా చర్చలు జరపడం ఉత్కంఠ రేపుతోంది. పరామర్శించడానికి వెళ్లిన షా.. ఈటలతో ప్రత్యేకంగా కలవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రంలో చేరికలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాజకీయంగా మంచి అనుభవం ఉండటంతోపాటు సుదీర్ఘకాలం టీఆర్ఎస్ లో పని చేసిన ఈటలకు ఆ బాధ్యతలు అప్పగించింది. టీఆర్ఎస్ లో అసంతృప్తులతోపాటు, కాంగ్రెస్ లో టికెట్ రాదు అనుకున్న వారిని బీజేపీ వైపు మళ్లించేలా ఈటల రాజేందర్ వ్యూహాలు రచిస్తున్నారు. సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహ శైలి తెలిసిన వ్యక్తి కావడంతో ఈటలకు బీజేపీలో మంచి ప్రాధాన్యత లభిస్తోంది. షా-ఈటల ఏకాంత భేటీలో చేరికలపైనా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.