King Charles III Coronation: బ్రిటన్‌ రాజుగా చార్లెస్‌ 3 పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. శనివారం లండన్‌లోని చారిత్రక వెస్ట్‌మిన్‌స్టర్‌ అబేలో ఈ వేడుక అట్టహాసంగా జరగనుంది. క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3 రాజుగా పట్టాభిషిక్తుడు కాబోతున్నారు. మరికొన్ని గంటల్లోనే ఆ వేడుక జరుగనుంది. ఇవాళ సాయంత్రం సరిగ్గా నాలుగున్నర గంటలకు పట్టాభిషేకం జరుగనుంది. నిజానికి.. బ్రిటన్‌లో 70 ఏళ్ల తర్వాత పట్టాభిషేక మహోత్సవం జరుగుతోంది. చివరిసారిగా 1953లో ఎలిజబెత్ రాణికి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిగింది. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఇటువంటి కార్యక్రమం జరగలేదు. అయితే.. గతేడాది ఆమె కన్నుమూయడంతో కొత్త రాజుగా ఆమె కుమారుడు ఛార్లెస్ నియమితులయ్యారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత బ్రిటన్‌లో జరుగుతున్న తొలి పట్టాభిషేకంగా ఈ కార్య‌క్ర‌మం రికార్డ్ సృష్టించ‌నుంది. ఇప్పటివరకు బ్రిట‌న్‌ను రాణులు పాలించగా.. తొలిసారిగా ఒక రాజు నాయకత్వం వహించబోతున్నారు. ఈ క్రమంలో.. చార్లెస్‌ పట్టాభిషేకం ఘనంగా నిర్వహించబోతోంది యూకే ప్రభుత్వం. పట్టాభిషేక మహోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.


బ్రిటన్‌‌ రాజుగా కింగ్‌‌ చార్లెస్‌‌- 3 బాధ్యతలు చేప‌ట్ట‌నున్నారు. వెస్ట్ మినిస్టర్ అబే చర్చిలో పట్టాభిషేక వేడుక జరగనుంది. రాణిగా కెమిల్లా కూడా క్వీన్‌‌ మేరీ కిరీటాన్ని ధరిస్తారు. ఆర్చి బిషప్ ఆఫ్ కాంటెర్‌‌బరీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పట్టాభిషేక మహోత్సవంలో భాగంగా.. ముందుగా ప్రదక్షిణ, పరిచయ కార్యక్రమం ఉంటుంది. బ్రిటన్‌లోని కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్‌ తొలుత కింగ్‌ ఛార్లెస్‌ను ఆహూతులకు పరిచయం చేస్తారు. ఆ తర్వాత.. రెండు ప్రమాణాలు చేయనున్నారు కింగ్‌ చార్లెస్‌. చట్టాన్ని కాపాడతానని, దయతో, న్యాయంతో పాలన కొనసాగిస్తానని ఛార్లెస్‌ ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత చర్చి ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు నమ్మకస్థుడైన ప్రొటెస్టెంట్‌ క్రిస్టియన్‌గా ఉంటానని ఛార్లెస్‌ రెండో ప్రమాణం చేస్తారు. 


కింగ్‌ చార్లెస్‌ 3 పట్టాభిషేకం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరగనున్నా వివిధ మత సంప్రదాయాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. హిందూ విశ్వాసానికి ప్రతినిధిగా నరేంద్ర బాబుభాయ్‌ పటేల్‌ కింగ్‌ చార్లెస్‌కు సార్వభౌమ ఉంగరాన్ని అందించనున్నారు. సిక్కు వర్గానికి చెందిన ఇంద్రజిత్‌ సింగ్‌ పట్టాభిషేక గ్లవ్‌ను అందిస్తారు. ముస్లింల ప్రతినిధిగా సయ్యద్‌ కమల్‌ బ్రాస్‌లేట్‌ జోడీని అందించనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి హిందువైన బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ హాజరుకానున్నారు. సంప్రదాయం ప్రకారం ఆయన కూడా మిగతా అతిథులతో కలిసి ఈ వేడుకలో బైబిల్‌ చదవనున్నారు.


కాగా.. అతిథుల పరిచయ కార్యక్రమంతో మొదలయ్యే ఈ వేడుక బంగారు తాపడం చేసిన బగ్గీలో రాజు, రాణి ప్రయాణంతో ముగుస్తుంది. ఈ పట్టాభిషేకానికి ప్రపంచ వ్యాప్తంగా 2వేల మంది అతిథులు హాజరవుతున్నారు. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు లండన్‌కు చేరుకుంటున్నారు. భారతదేశం తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ఆయన సతీమణి సుదేశ్‌ ధన్‌ఖడ్‌ లండన్‌కు చేరుకున్నారు. 


రాజుగా తన పట్టాభిషేకం అనంతరం ఛార్లెస్‌ సుమారు 4 లక్షల మందికి కృతజ్ఞతా బహుమతులు అందించనున్నారు. పట్టాభిషేక కార్యక్రమ ఏర్పాట్లలో పాల్గొన్న వివిధ శాఖల సిబ్బందికి, దేశానికి సేవలందిస్తున్న ఆర్మీ, పోలీసు, అత్యవసర సేవల సిబ్బందికి వీటిని అందించనున్నారు. ఇందుకోసం ఛార్లెస్‌, కెమిల్లా ప్రతిమలతో కూడిన పతకాలను తయారుచేశారు.