Hottest Month: ఈ ఏడాది జులై నెల అత్యంత వేడి నెలగా రికార్డుకెక్కిన విషయం తెలిసిందే. భూమిపై అత్యంత వేడి మాసంగా జులై నెల నిలిచింది. వాతావరణ ట్రాకింగ్ టూల్స్, ఉపగ్రహాల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా నాసా ఈ విషయాన్ని గత నెల చివర్లో వెల్లడించింది. అయితే ఈ వేడి ప్రతాపం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా ఉన్నట్లు తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. యూరోప్, చైనా, అమెరికా సహా చాలా దేశాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు తెలిపారు. ఈ వేడితో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 81 శాతం మంది ప్రజలు ప్రభావితం అయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటే 6.5 బిలియన్ల కంటే ఎక్కువ మంది జులై నెలలో వేడిని ఎదుర్కొన్నారని రిపోర్టులు చెబుతున్నాయి. గ్రీన్ హౌజ్ వాయువులు, వాతావరణ మార్పుల కారణంగా రోజు వారీ ఉష్ణోగ్రతలు గణనీయంగా ప్రభావితం అయినట్లు పరిశోధకులు చెబుతున్నారు. 


మానవ ప్రేరేపిత గ్లోబల్ వార్మింగ్ జులైలో భూమిపై ప్రతి ఐదుగురు వ్యక్తుల్లో నలుగురిపై భరించలేని వేడిని వెదజల్లిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. క్లైమేట్ సెంట్రల్ అనే లాభాపేక్ష లేని సంస్థ చేసిన పరిశోధనలో.. 2 బిలియన్లకు పైగా జనం నెల పొడవునా వాతావరణ మార్పు వల్ల వేడిని అనుభవించారని పరిశోధకులు గుర్తించారు. పరిశోధకులు 4,711 నగరాలను పరిశీలించగా.. అందులో 4,019 నగరాల్లో వాతావరణ మార్పు గణనీయంగా ఉన్నట్లు కనుగొన్నారు. బొగ్గు, చమురు, సహజవాయువును మండించడం వంటి వాటి వల్ల ఈ నగరాల్లో కనీసం ఒక రోజు ఉష్ణోగ్రతలు మూడు రెట్లకు పైగా పెరిగినట్లు గుర్తించారు. 


Also Read: Chikoti Praveen: బీజేపీలోకి క్యాసినో కింగ్! ఢిల్లీలో బండి సంజయ్‌ని, డీకే అరుణను కలిసిన చికోటి ప్రవీణ్


అత్యంత వేడి రోజుగా జులై 3


2023 జులై 3వ తేదీ సోమవారం రోజును అత్యంత వేడి రోజుగా రికార్డు క్రియేట్ చేసింది యూఎస్ నేషనల్ సెంటర్స్ ఫర్ ఎన్విరాన్‌ మెంటల్ ప్రిడిక్షన్. సగటు ప్రపంచ ఉష్షోగ్రత 17.01 డిగ్రీల సెల్సియస్ (62.62 ఫారెన్‌హీట్)కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎండలు విజృంభించడంతో.. ఆగస్టు 2016 రికార్డును బ్రేక్ చేసింది. 2016 ఆగస్టు నెలలో 16.92C (62.46F)ను అధిగమించింది. దక్షిణ యూఎస్ ఇటీవల ఎండల్లో మగ్గిపోతోంది. ఎండల వేడిని తట్టుకోలేక ఇళ్ల నుంచి బయకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. చైనాలో 35C (95F) కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో తీవ్రమైన ఎండలు కొనసాగాయి. ఉత్తర ఆఫ్రికాలో 50C (122F) సమీపంలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అలాగే అంటార్కిటికాలో ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది. అయినప్పటికీ.. అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేసింది. శ్వేత ఖండంలోని అర్జెంటీనా దీవులలో ఉక్రెయిన్ వెర్నాడ్‌స్కీ రీసెర్చ్ బేస్ ఇటీవల 8.7C (47.6F)తో జూలై ఉష్ణోగ్రత రికార్డును బద్దలు కొట్టింది. 


ఇది మనం గొప్పగా చెప్పుకోవాల్సిన మైలు రాయి కాదని బ్రిటన్ ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లోని గ్రాంథమ్ ఇన్‌ స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌కు చెందిన వాతావరణ శాస్త్రవేత్త ఫ్రెడెరిక్ ఒట్టో అన్నారు. అలాగే ఇది ప్రజలకు, పర్యావరణ వ్యవస్థలకు మరణ శిక్ష లాంటిదని కామెంట్ చేస్తున్నారు. వాతావరణ మార్పు, ఎల్‌నినో దీనికి కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. దురదృష్టవశాత్తుగా పెరుగుతున్న ఎల్ నినోతో పాటు పెరుగుతున్న (కార్బన్ డయాక్సైడ్), గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలతో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల్లో ఇది మొదటి దశగా చెబుతున్నారు.