Chikoti Praveen: క్యాసినో కింగ్ చికోటీ ప్రవీణ్ రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బండి సంజయ్, డీకే అరుణను కలిసి శాలువా కప్పి సత్కరించడం చర్చనీయాంశంగా మారింది. రాంచందర్ రావును కూడా చికోటి కలిసినట్లు సమాచారం. పలు వివాదాల్లో ఉన్న చికోటి ప్రవీణ్.. వరుసగా బీజేపీ అగ్రనేతలను కలవడంతో బీజేపీలోకి చేరడానికి లైన్ క్లియర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్ నుంచి చికోటి ప్రవీణ్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అక్రమంగా క్యాసినోలు నిర్వహించడం, నిబంధనలకు విరుద్ధంగా వన్యప్రాణులను పెంచుకోవడం సహా అనేక కేసుల్లో ఉన్న చికోటి ప్రవీణ్ ను.. బీజేపీ పార్టీలోకి ఆహ్వానిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. రేషన్ షాపు నిర్వహించడం నుంచి మొదలైన చికోటి ప్రవీణ్ జీవితం.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఆ తర్వాత క్యాసినోలు నిర్వహించడం, రాజకీయ నేతలు, సెలబ్రిటీలతో సంబంధాలు నెరపడం వరకు సాగింది. చికోటి ప్రవీణ్ పై ఈడీ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
బోనాల పండగలో గన్‌మెన్‌లతో చికోటి హల్‌చల్
ఇటీవల బోనాల పండగ సందర్భంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయానికి ప్రైవేట్ గన్‌మెన్లతో వెళ్లారు చికోటి ప్రవీణ్. ముగ్గురు గన్ మెన్లతో వచ్చి హల్చల్ చేయడం వివాదాస్పదమైంది. ముగ్గురు గన్ మెన్ల వద్ద ఫార్జరీ లైసెన్సులు ఉండటంతో వారితోపాటు చికోటి ప్రవీణ్ పై ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో చికోటి ప్రవీణ్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. హైదరాబాద్, ఏపీ తో పాటు థాయిలాండ్, నేపాల్ దేశాల్లో క్యాసినో వ్యవహరాల్లో కూడా చికోటి ప్రవీణ్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. హిందుత్వ కోసం పని చేస్తున్నా అని చెప్పుకునే చికోటి ప్రవీణ్.. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సహా పలువురు నేతలను కలవడం చర్చనీయాంశంగా మారింది.
గల్లీ నుంచి బ్యాంకాక్ వరకు సామ్రాజ్యం
సైదాబాద్ వినయ్ నగర్ కాలనీ లో నివాసం ఉండే చికోటి ప్రవీణ్ మొదట పేకాట శిబిరాలు నిర్వహించేవారు. నగర శివార్లలోని ఫార్మ్ హౌస్ లో ప్రముఖులతో పేకాట శిబిరాలు ఏర్పాటు చేసేవారు. అయితే అవి ధనవంతులకు మాత్రమే. చికోటి నిర్వహించే పేకాటలో.. టేబుల్ ప్రారంభమే 25 లక్షలతో ప్రారంభమవుతాయని చెబుతారు. పలుమార్లు ఈ కేసుల్లో పట్టుబడినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కేసినో మీద దృష్టి పెట్టారు. పలు స్టార్ హోటళ్లలో రహస్యంగా కేసినోలు నిర్వహించారు. ఈ అంశంపైనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గోవా, నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, బ్యాంకాక్ లలో క్యాసినో కంపెనీలతో సంబంధాలు పెట్టుకున్నారు. గోవాలోని
"బిగ్ డ్యాడీ" క్యాసినోలో చీకోటి పార్టనర్ అనే ప్రచారం ఉంది. "బిగ్ డ్యాడీ" క్యాసినో గోవాలో ఫేమస్.. ఇధి షిప్ లో నిర్వహించే క్యాసినో. గతంలో నేపాల్ లో నిర్వహించిన క్యాసినో కు తెలంగాణ, ఆంధ్రాకు చెందిన ప్రముఖులను స్పెషల్ ఫ్లైట్ లో తీసికెళ్ళి క్యాసినో ఆడించినట్టు ఈడీ వద్ద సమాచారం ఉండటంతో సోదాలు చేశారు.