Worlds Hottest July Month: ప్రపంచం మొత్తం జూలై నెలలో అనూహ్య వాతావరణ మార్పులు చూడబోతున్నట్లు నాసా వెల్లడించింది. యూరప్, చైనా, అమెరికాలో వీస్తున్న వేడిగాలులు ఉష్ణోగ్రత రికార్డులు చెరిపివేస్తాయని నాసా అధికారులు వెల్లడించారు. ఈ గాలులు ఇతర దేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నాసా వాతావరణ శాస్త్రవేత్త గావిన్ స్మిత్ చెప్పారు.
గురువారం నాసా శాస్త్రవేత్తలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గావిన్ స్మిత్ సంచలన విషయాలు చెప్పారు. జూలై నెల ప్రపంచం మొత్తం అత్యంత వేడిగా ఉండే నెల కాబోతుందని వెల్లడించారు. యూరోపియన్ యూనియన్, యూనివర్సిటీ ఆఫ్ మైన్ రికార్డుల ప్రకారం ఈనెల లో ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజువారిగా ఆయా ప్రభుత్వాలు నమోదు చేస్తున్న ఉష్ణోగ్రతల వివరాలతో ఉపగ్రహాలు అందించే డేటాను కంపేర్ చేసి వివరాలు అందజేశారు.
వివిధ దేశాలు, సంస్థలు ఇచ్చిన డేటాలో తేడాలు ఉన్నాయని అయితే అది స్వల్పమే అని చెప్పారు. ఎవరు ఎలాంటి రిపోర్టులు ఇస్తున్న వేడి గాలుల ప్రభావం మాత్రం కచ్చితంగా ఉంటుందని స్మిత్రి పోర్టర్లకు చెప్పారు. అమెరికా ఏజెన్సీలు విడుదల చేసిన నెలవారి నివేదికల్లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోందని వెల్లడించారు. కొన్ని వందల ఏళ్లుగా భూమిపై ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదు అవ్వలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఉష్ణోగ్రతలకు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
దీనంతటికీ ఎల్‌నినో మాత్రమే కారణమని చెప్పలేమని స్మిత్ అన్నారు. వాతావరణం వస్తున్న అనూహ్య మార్పుల్లో ఎల్‌నినో చిన్న పాత్ర మాత్రమే పోషిస్తోందన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్న ఉష్ణోగ్రతలు అన్ని ప్రాంతాల్లో ఉంటాయని, సముద్రతీర ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉంటాయని స్మిత్ వివరించారు. రానున్న రోజుల్లో రికార్డు బద్దలు చేసే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు చూసే అవకాశం ఉందని, ఫలితంగా వేడిగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులు కొనసాగుతున్నడమే ఈ ఉష్ణోగ్రతలకు మరో కారణమని వెల్లడించారు. మరి కొన్ని రోజుల్లో 2023 సంవత్సరం అత్యంత వేడిగా ఉండే సంవత్సరంగా నమోదయ్యే అవకాశాలను ఉన్నాయి అన్నారు. ప్రస్తుతం నాసా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ అవకాశం 50 శాతంగా ఉండగా, ఇతర శాస్త్రవేత్తల గణాంకాల ప్రకారం 80% గా ఉంటుందన్నారు. యూరప్ సహా వివిధ దేశాల్లో గతవారం నమోదైన ఉష్ణోగ్రతలతో గత రికార్డులు చెదిరిపోయాయని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని హెచ్చరించారు.
వచ్చే మరికొన్ని రోజుల్లో ఎల్‌నినో గరిష్ట స్థాయికి చేరకోనుంది. దీని ఫలితంగా 2024 కూడా అత్యంత వేడి కలిగిన సంవత్సరంగా రికార్డుల్లోకి ఎక్కబోతున్నట్టు వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రజలు ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial