Japan Liquor Competition : ప్రభుత్వాలు మద్యం ఎందుకు అమ్ముతాయి. ఆదాయం కోసమే. అయితే మన దేశంలో మాత్రం ప్రభుత్వం ఆ విషయం ఒప్పుకోవు. మద్యం ఆదాయం లేకపోతే పూట గడవని పరిస్థితి ఉన్నా... అసలు తాము మద్యం అమ్ముతోంది ఆదాయం కోసం కాదని చెబుతూంటాయి.  ఎక్కువ రేట్లు పెడితే.. మద్యం తాగేవారిని తగ్గించడానికని కూడా చెబుతాయి. అయితే కొన్న ప్రభుత్వాలు మాత్రం..  మద్యం ఆదాయాన్ని పెంచుకోవడానికేనని బహిరంగంగా చెబుతూ..  స్కీమ్స్ కూడా ప్రారంభిస్తూ ఉంటాయి. అయితే అవి మనం దేశంలో కాదు.. ఇతర దేశాల్లో. 


యువతకు మద్యం అలవాటు చేయాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయం 


తాజాగా జపాన్ ప్రభుత్వం యువతను మద్యం అలవాటు చేసుకోమని బతిమాలుతోంది.  జాతీయ స్థాయిలో మద్యం తాగే  పోటీలు నిర్వహిస్తోంది.  మద్యాన్ని ఎలా తాగించాలో ఐడియాలు చెప్పండంటూ రిక్వెస్ట్‌లు సైతం చేసింది.  జపాన్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన  ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.   కరోనా, ఇతర కారణాల వల్ల ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న జపాన్‌ ప్రభుత్వం.. మద్యం అమ్మకాలు మెరుగుపడేలా చేసి, దాని ద్వారా ఆదాయం పొందాలని చూస్తోంది. దీనికోసం జపాన్‌ ప్రభుత్వం అక్కడి యువతతో సాధ్యమైనంత ఎక్కువ మద్యాన్ని తాగించాని శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. 


ఆదాయం తగ్గిపోవడంతో నిర్ణయం 


 నేషనల్‌ ట్యాక్స్‌ ఏజెన్సీ 'సేక్‌ వివా' పేరుతో జాతీయ స్థాయిలో పోటీలను ప్రారంభించింది. ఈ పోటీలో 20-39ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతీ యువకులు ఈ పాల్గనవచ్చని తెలిపింది. ఈ పోటీలో పాల్గన్న యువత.. యూత్‌లో మందు కొట్టే అలవాటును పెంచేందుకు ఏం చేయాలో సలహాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ పోటీలు సెప్టెంబర్‌ 9 వరకు కొనసాగుతాయని.. ఆసక్తి ఉన్న యువత ఇందులో పాల్గనవచ్చని వెల్లడించింది.జపాన్‌లో ఇప్పుడున్న యువత.. వారి తల్లిదండ్రులు, పూర్వీకులతో పోల్చితే తక్కువ మద్యాన్ని సేవిస్తున్నారట. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ మందుకు దూరంగా ఉంటున్నారట. దీంతో జపాన్‌ ప్రభుత్వానికి మద్యంపై వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందట. 


మద్యం అలవాటును పూర్తిగా మానేస్తున్న జపాన్ యువత 


1980ల్లో మొత్తం ట్యాక్స్‌ రెవెన్యూల్లో  మద్యంపైనే వచ్చే ఆదాయం 5శాతం ఉండగా.. 2011లో 3శాతానికి పడిపోయింది. అదికాస్తా 2020లో 1.7శాతానికి పరిమితమైంది. దీంతో ఎలాగైనా సరే యువతను మద్యం తాగేలా చేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా జపాన్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మద్యం ద్వారా వచ్చిన ఆదాయంతోనే జపాన్‌ తన ప్రభుత్వాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. జపాన్‌లో   మద్యం వల్ల కలిగే హానీ.. ప్రయోజనాలపై స్పష్టమైన అవగాహన  కలిగి ఉంటారు. నలభై ఏళ్లు దాటిన వారు స్వల్పంగా మద్యం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదన్న నివేదికలు ఉన్నాయి. జపాన్ ప్రజలు పూర్తిగా వర్క్ కల్చర్‌లో ఉంటారు. ఈ కారణంగా కూడా జపాన్‌లో మద్యం తాగేవారి సంఖ్య తగ్గిపోతోంది. ఎలాగైనా ఆ సంఖ్యను పెంచాలని జపాన్ సర్కార్ తంటాలు పడుతోంది