Somalia Terror Attack:


రెండు కార్లలో బాంబులు..


సోమాలియాలో ఉగ్రదాడి జరిగింది. రాజధాని మొగదిషులోని ఓ హోటల్‌పై అల్ షహబ్ ( Al-Shabab) టెర్రరిస్ట్ గ్రూప్ దాడి చేసింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. హోటల్‌లోని రెండు చోట్ల కార్లలో బాంబులు పెట్టి పేల్చారు ఉగ్రవాదులు. ఆ తరవాత కాల్పులు జరిపారు. ఈ పని చేసింది తామేనని ఆ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ ఘటనలో గాయపడిన 9 మందిని ఆసుపత్రికి తరలించారు. "హోటల్ హయాత్‌లో రెండు కార్లలో బాంబులు అమర్చారు. ఓ కారు హోటల్ బ్యారియర్‌కు ఢీకొట్టి పేలిపోగా...మరోటి గేట్‌ను ఢీకొట్టి 
బ్లాస్ట్ అయింది. ఉగ్రవాదులు హోటల్‌లోనే ఉన్నట్టు భావిస్తున్నాం" అని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇద్దరు ఇంటిలిజెన్స్ అధికారులు కూడా ఇది ఉగ్రవాదుల పనేనని తేల్చి చెప్పారు. అల్‌ షహబ్..అల్‌ఖైదాతో లింకులున్న ఉగ్రవాద సంస్థ. సోమాలియాలోని ప్రభుత్వాన్ని పడగొట్టడానికి దాదాపు పదేళ్లుగా ఇలా అలజడి సృష్టిస్తూనే ఉంది ఈ గ్రూప్. దేశంలో ఇస్లామిక్‌ లా ని అమలు చేసి...ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. ఇప్పుడే కాదు. గతంలోనూ ఇలాంటి దాడులకు తెగబడ్డారు అల్ షహబ్ ఉగ్రవాదులు. గతేడాది ఆగస్టులో మొగదిషులోనే ఓ హోటల్‌పై దాడి చేసింది. ఆ ఘటనలో 16 మంది మృతి చెందారు. ఇది కూడా తమ పనేనని అప్పట్లో ప్రకటించింది అల్ షహబ్.





 


అల్‌ఖైదాతో లింకులు..


ఆఫ్రికన్ యూనియన్ ఫోర్స్ (African Union Force) 2011లోనే ఈ ఉగ్రవాదులతో తీవ్ర పోరాటం చేశారు. రాజధానిలో వాళ్ల ఉనికి లేకుండా చేయాలని ప్రయత్నించారు. కొంత మేర విజయం సాధించినా...ఇంకా కొందరు ఉగ్రవాదులు తప్పించుకుని తిరుగుతూ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. హయాత్ హోటల్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరపగా...భద్రతా బలగాలు ప్రతిఘటించాయి. ప్రస్తుతం వీళ్లంతా హోటల్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. "ఎంత మంది చనిపోయారన్నది స్పష్టత లేదు. సెక్యూరిటీ ఫోర్సెస్ ఉగ్రవాదులతో పోరాడుతున్నారు" అని పోలీసులు తెలిపారు. ఈ హయాత్ హోటల్‌ సమీపంలో చాలా హోటల్స్ ఉంటాయి. అందుకే ఉగ్రవాదులు ఈ స్పాట్‌ను ఎంచుకున్నట్టు సమాచారం. పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే పనిలో ఉన్నారు. గతవారం అమెరికా ఓ కీలక ప్రకటన చేసింది. తమ భద్రతా బలగాలు..13 మంది అల్‌షహబ్ ఉగ్రవాదుల్ని హతమార్చినట్టు ప్రకటించింది. సోమాలీ ఫోర్సెస్‌పై దాడి చేస్తుండటాన్ని గమనించి... ఉగ్రవాదులను హతమార్చినట్టు వెల్లడించింది. ఇటీవల చాలా చోట్ల ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా సైన్యం ఎయిర్ రెయిడ్స్‌ నిర్వహించింది. అధ్యక్షుడిగా హసన్ షేక్ మహమ్మద్ అధికారం చేపట్టిన తరవాత ఈ స్థాయిలో దాడులు జరగటం ఇదే తొలిసారి. 


Also Read: Food Toxins: మనం తినే ఆహారాల్లో ఉండే ఆరు విష సమ్మేళనాలు ఇవే, వీటిని ఎక్కువ తింటే అంతే సంగతులు


Also Read: Mathura: కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం, ఊపిరాడక ఇద్దరు మృతి