Jail For Goats: ప్రపంచంలో చాలా వింత ఘటనలు జరుగుతుంటాయి. రష్యాలోని కోమి ప్రావిన్స్‌లోగల సిక్టివ్‌కర్ నగరంలోని జైలులో ఓ పిల్లి అక్రమంగా ఫోన్‌లు, గాడ్జెట్‌లు రవాణ చేస్తుందని అరెస్టు చేసి బంధించారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ ఎనిమిది గాడిదలు లక్షల విలువ చేసే మొక్కలను తినేశాయని అరెస్టు చేసి జైల్లో పెట్టారు.


కర్ణాటకలో చాలా చోట్ల కోళ్లకు బస్సులో టికెట్ కొట్టడం చూశాం. పేకాట, కోళ్ల పందేళ్లలో కోళ్లను పట్టుకోవడం చూసుంటాం. వాటిని పోలీస్ స్టేషన్లో ఉంచడం కూడా మనకు తెలిసే ఉంటుంది.  అదే జైలుకు పంపడం గురించి తెలుసా? ఏకంగా ఏడాది పాటు జైలులో ఉంచారట?


తప్పు చేస్తే మనుషులు జైలుకు వెళ్తారని తెలుసు! అదే జంతువులకు కూడా జైలు శిక్ష వేస్తారని తెలుసా? తప్పు చేశాయంటూ మూగ జీవులను జైల్లో పెట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా..? కానీ ఇది నిజం.  తప్పు చేశాయని మేకలను ఏడాది పాటు జైలు శిక్ష విధించిన ఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది. జైలు శిక్ష అనంతరం ఓ నాయకుడి చొరవతో ఇటీవలే ఆ మేకలు విడుదలయ్యాయి. 


పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఇటీవల ఈ వింత ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2022 డిసెంబర్‌ 6న షహరియార్‌ సచిబ్‌ రాజీబ్‌ అనే వ్యక్తికి చెందిన తొమ్మిది మేకలు స్థానిక శ్మశాన వాటికలోని చెట్ల ఆకులు, గడ్డి తిన్నాయి. దాంతో అధికారులు ఆ 9 మేకలను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఏడాది కాలంగా బరిసాల్‌లోని చెరశాలలో ఆ మేకలు బంధీలుగా ఉంచారు. 


తన మేకలను విడిపించుకునేందుకు వాటి యజమాని చేయని ప్రయత్నాలు లేవు. తనకు తెలిసిన నేతలను అందరిని కలిసి మేకలను విడిపించాలని ప్రాధేయపడ్డాడు. అయినా ఒక్కరు కూడా మేకలను విడిపించలేకపోయారు. ఆయన ప్రయత్నాలు అన్నీ ప్రయోజనం లేకుండా పోయాయి. అయితే ఇటీవల బరిసాల్‌ సిటీ కార్పొరేషన్‌కు కొత్త మేయర్‌ ఎన్నికయ్యాడు. దాంతో సచిబ్‌ రాజీబ్‌ ఆ మేయర్‌ని సంప్రదించి తన గోడు చెప్పుకున్నాడు. 


సచిబ్‌ రాజీబ్‌ చెప్పిన సంగతి విన్న మేయర్‌ అవాక్కయ్యారు. మేకలను జైలులో పెట్టడం ఏంటని అధికారులను అడిగారు. మేకలను విడిచిపెట్టాలని ఆదేశించారు. మేయర్‌ చొరవతో అధికారులు బంధించి ఉన్న తొమ్మిది మేకలను రాజీబ్‌కు అప్పగించారు.