Isreal-Hamas War : ఇజ్రాయెల్‌-హమాస్‌ (Isreal-Hamas ) యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ (Us President joe Biden ) సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రపంచ మద్దతు కోల్పోతోందని, దీర్ఘకాలిక పరిష్కారానికి నెతన్యాహు ప్రభుత్వం అడ్డంపడుతోందని వ్యాఖ్యానించారు.  అన్నారు. విచక్షణా రహితంగా చేస్తున్న బాంబింగే దీనికి ప్రధాన కారణమని, కఠిన పదజాలంతో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు (  Netanyahu )ను హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో సహా నెతన్యాహు మారాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.  కొన్ని విషయాలను నెతన్యాహు అర్థం చేసుకొంటాడన్న బైడెన్, వార్‌ కేబినెట్‌, నేషనల్‌ సెక్యూరిటీ మినిస్టర్‌ బెన్‌ గ్విర్‌ ఎంత వరకు అర్థం చేసుకొంటారో చెప్పలేనంటూ కుండబద్దలు కొట్టారు. 


జోబైడెన్‌, నెతన్యాహు మధ్య అభిప్రాయ భేదాలు
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మధ్య అభిప్రాయ భేదాలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా బైడెన్‌ బహిరంగ వ్యాఖ్యలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. నెతన్యాహుతో ఇప్పటికే పలు మార్లు మాట్లాడానన్న బైడెన్, ఇజ్రాయెల్‌ రక్షణ బాధ్యత అమెరికాతో ముడిపడి ఉందని వ్యాఖ్యానించారు. ఆ దేశానికి ఐరోపా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మద్దతు ఉందని, గాజాలో జరుపుతున్న విచక్షణా రహిత బాంబింగ్‌ తో ప్రస్తుతం ఇజ్రాయెల్ మద్దతు కోల్పోవడం మొదలైందని అన్నారు. అమెరికాపై  9/11 దాడుల అనంతర పరిణామాల నుంచి ఇజ్రాయెల్‌ పెద్దగా నేర్చుకోలేదని బైడెన్‌ అభిప్రాయపడ్డారు.


 హౌతీ రెబల్స్‌ పై చర్యలు తీసుకోకపోతే...
మరోవైపు అమెరికా ప్రతిపాదించిన యుద్ధానంతర ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు తిరస్కరించారు. ప్రధానంగా డెమొక్రటిక్‌ పార్టీకి విరాళాలు ఇచ్చే వారి నుంచి ఒత్తిడి పెరగడంతో...జో బైడెన్‌ స్వరంలో మార్పునకు కారణమైనట్లు తెలుస్తోంది. ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్‌ తరచూ తమ దేశ నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడంపై ఇజ్రాయెల్‌ ఆగ్రహంతో రగిలిపోతోంది. అమెరికా చర్యలు తీసుకోకపోతే తామే రంగంలోకి దిగుతామని నెతన్యాహు హెచ్చరించారు. 


 ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో కాల్పుల విరమణ, బందీలను బేషరతుగా విడుదల చేయాలంటూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్  అనుకూలంగా ఓటు వేసింది. రెండు ప్రాంతాల మధ్య శాంతి నెలకొల్పాల్సిన ఆవశ్యకతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ మద్య సమతుల్యతను సాధించడమే సవాలు అని రుచిరా కాంబోజ్ పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించడానికి అంతర్జాతీయ సమాజం  ఉమ్మడిగా ఆలోచించడం గొప్ప విషయమని, భారత్ దానిని స్వాగతిస్తుందని పేర్కొన్నారు. మంగళవారం ఐక్యరాజ్యసమితిలో జరిగిన అత్యవసర ప్రత్యేక సమావేశంలో ఈజిప్ట్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని 193 మంది సభ్యుల UN జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 153 ఓట్లు రాగా, 10 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. 23 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరు అయ్యాయి. గాజాలో తక్షణం మానవతావాద కాల్పుల విరమణను కోరుతూ అల్జీరియా, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాలస్తీనా  తీర్మానించాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అన్ని దేశాలు తమ బాధ్యతలను పాటించాలని ఐక్యారాజ్య సమితి పునరుద్ఘాటించింది. ముఖ్యంగా పౌరుల రక్షణకు సంబంధించిన అంశాలను విధిగా పాటించాలని యూన్ సూచించింది.