UN Resolution Demanding: ఇజ్రాయెల్ - హమాస్ వివాదం  (ISrael Hamas War)లో తక్షణం కాల్పుల విరమణ (Ceasefire), బందీలుగా ఉన్న వారందరిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి (United Nations) జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా భారత్ (India) ఓటు వేసింది. మంగళవారం ఐక్యరాజ్యసమితిలో జరిగిన అత్యవసర ప్రత్యేక సమావేశంలో ఈజిప్ట్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని 193 మంది సభ్యుల UN జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 153 ఓట్లు రాగా, 10 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. 23 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరు అయ్యాయి.


ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా మానవ సంక్షోభం ఉందని, పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి అనుకూలంగా భారతదేశం ఓటు వేసిందన్నారు.  అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో తీవ్రవాద దాడి జరిగింది, ఆ సమయంలో పట్టుకున్న బందీలపై ఆందోళన వ్యక్తం చేశారు. 


పెద్ద ఎత్తున జనజీవనం స్తంభించిందని, ముఖ్యంగా మహిళలు, పిల్లల భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. రెండు ప్రాంతాల మధ్య శాంతి నెలకొల్పాల్సిన ఆవశ్యకతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ మద్య సమతుల్యతను సాధించడమే సవాలు అని రుచిరా కాంబోజ్ పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించడానికి అంతర్జాతీయ సమాజం  ఉమ్మడిగా ఆలోచించడం గొప్ప విషయమని, భారత్ దానిని స్వాగతిస్తుందని పేర్కొన్నారు.  


గాజాలో తక్షణం మానవతావాద కాల్పుల విరమణను కోరుతూ అల్జీరియా, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాలస్తీనా  తీర్మాణించాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అన్ని దేశాలు తమ బాధ్యతలను పాటించాలని ఐక్యారాజ్య సమితి పునరుద్ఘాటించింది. ముఖ్యంగా పౌరుల రక్షణకు సంబంధించిన అంశాలను విధిగా పాటించాలని యూన్ సూచించింది.


అలాగే బందీలను తక్షణమే, షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అయితే తీర్మాణంలో ఎక్కడా హమాస్ పేరు పెట్టకపోవడం గమనార్హం. ఈ ముసాయిదా తీర్మానానికి అమెరికా సవరణను ప్రతిపాదించింది. అక్టోబర్ 7, 2023 నుంచి ఇజ్రాయెల్‌లో హమాస్ చేసిన హేయమైన ఉగ్రవాద దాడులను వ్యతిరేకించాలని, ఖండించాలని ప్రతిపాదించింది. సవరణకు భారత్ అనుకూలంగా ఓటు వేసింది.


అక్టోబరులో, ఇజ్రాయెల్ - హమాస్ సంఘర్షణలో తక్షణ సంధి, గాజా స్ట్రిప్‌లో మానవతా సాయానికి అవరోధం లేకుండా పిలుపునిచ్చిన తీర్మానానికి ఇండియా గైర్హాజరైంది. ఆ సమయంలో గాజా స్ట్రిప్ అంతటా పౌరులకు అవసరమైన వస్తువులు, సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ జోర్డానియన్ -ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. యుద్ధంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, గాయపడ్డారని, వారికి సాయం అందిచాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉందని పేర్కొంది.


అక్టోబరు 7న హమాస్, ఇతర పాలస్తీనా సాయుధ గ్రూపులు జరిపిన తీవ్రవాద దాడుల్లో 33 మంది చిన్నారులతో సహా 1,200 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH) ప్రకారం, ఇప్పటి వరకు కనీసం 18,205 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 70 శాతం మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. 49,645 మంది గాయపడ్డారు.