Earthquake In Afghanistan: భూకంపం (Earthquake)తో ఆఫ్ఘనిస్తాన్‌ (Afghanistan) మరోసారి వణికిపోయింది. మంగళవారం ఉదయం  7.35 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. భూకంపం గురించి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 






నవంబర్‌లో
ఇటీవల వరుస భూకంపాలతో ఆఫ్ఘనిస్తాన్‌ వణికిపోతోంది. నవంబర్ 21న ఆ దేశ రాజధాని కాబూల్‌ (Kabul) పట్టణానికి పశ్చిమాన 4.1 తీవ్రతతో భూమి కంపించింది. అర్ధరాత్రి 12.03 గంటలకు భూకంపం వచ్చిందని, భూకంప కేంద్రం కాబూల్‌కు పశ్చిమాన ఉన్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 73 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 


అక్టోబర్‌లో
అక్టోబర్‌ 7న సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 4 వేలకుపైగా మరణించారు. 20 గ్రామాల్లో దాదాపు 2 వేల ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. భూకంప ధాటికి కొన్ని గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హెరాత్ ప్రావిన్స్‌లో తీవ్ర నష్టం వాటిల్లింది.  పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోయాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. 


కొంతమంది ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు.  వేలాది ఇళ్లు నేలమట్టమై ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారికి తిండి, ఆశ్రయం లభించలేదు. ప్రజలు ఆకాశం క్రింద ఆశ్రయం పొందాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితిలో, అనేక దేశాలు ఆఫ్ఘనిస్తాన్‌కు ఆర్థిక సహాయం చేశాయి.


అక్టోబర్ 7 విషాదానికి సరిగ్గా వారం రోజుల తరువాత మరోసారి అక్కడ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో ఇది చోటు చేసుకొంది. హెరాత్‌ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో దాదాపు 8 కిలోమీటర్ల ఉపరితలం కింద ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపంలో ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు. 


జూన్‌లో 300 మంది మృతి
జూన్ 22న సైతం ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై 6.1 గా భూకంప తీవ్రత నమోదైంది.  6.1 తీవ్రతతో భూకంపం రావడంతో సుమారు 300 మందికి పైగా మరణించారు. ఆఫ్ఘనిస్తాన్ లోని ఖోస్ట్‌కు 44కిమీ దూరంలో భూకంపం సంభవించడంతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అనేకమంది శిథిలాల కింద చిక్కుకుని మరణించారు.