Watch Video:
ఇటలీ పార్లమెంట్‌లో..
ఇటలీ పార్లమెంట్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. అక్కడి ఎంపీ గిల్డా స్పోర్టిలో (Gilda Sportiello) తన బిడ్డకు పార్లమెంట్‌లోనే పాలిచ్చింది. ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే బిడ్డ ఆకలి తీర్చేందుకు వెనక్కి వెళ్లి ఓ బెంచ్‌పై కూర్చుని బ్రెస్ట్ ఫీడింగ్ (Breast Feeding) చేసింది. ఇది చూసిన సభ్యులు వెంటనే లేచి నిలబడ్డారు. చప్పట్లు కొడుతూ ఆమెని అభినందించారు. చాలా సేపటి వరకూ ఆ హాల్ చప్పట్లతో మారు మోగింది. "మీ అబ్బాయి నిండు నూరేళ్లు ఆనందంగా బతకాలని కోరుకుంటున్నాం" అని చెప్పారు. గతేడాది నవంబర్‌లో పార్లమెంటరీ ప్యానెల్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఎంపీలు ఎవరైనా తమ బిడ్డలకు పార్లమెంట్‌లోనే తమ ఛాంబర్‌లో పాలిచ్చేందుకు అనుమతినిచ్చింది. ఈ బిల్ పాస్ చేయడంలో స్పోర్టిలో ప్రత్యేక చొరవ చూపించారు. ఇప్పుడు ఆమే...తన బిడ్డకు పాలిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఉద్యోగం చేసే మహిళలు ఎప్పుడు పడితే అప్పుడు బిడ్డకు పాలివ్వడం కుదరదని, ఇది ఆలోచించే పార్లమెంటరీ ప్యానెల్ నిర్ణయం తీసుకుందని పలువురు నేతలు స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం తీసుకున్నాక ఇటలీ పార్లమెంట్‌లో బిడ్డకు పాలిచ్చిన తొలి మహిళగా నిలిచారు గిల్డా.
స్పెషల్ రూమ్ ఏర్పాటు
"కొంత మంది మహిళలు బిడ్డకు పాలివ్వడం కూడా కుదరదు. కచ్చితంగా ఉద్యోగానికి వెళ్లాల్సిన పరిస్థితులుంటాయి" అని చెబుతున్నారు స్పోర్టిలో. అందుకే ఈ బిల్ పాస్ అయ్యేందుకు చొరవ చూపినట్టు వెల్లడించారు. మహిళా హక్కుల కోసం చాన్నాళ్లుగా పోరాటం చేస్తున్న గిల్డా స్పోర్టిలో...లాయర్ కూడా. మిగతా దేశాల్లో అయితే...పార్లమెంట్‌లో చనుబాలివ్వడం సాధారణంగానే కనిపిస్తుండొచ్చు. కానీ...ఇటలీలోని పార్లమెంట్ సభ్యుల్లో పురుషుల సంఖ్యే ఎక్కువ. మూడింట రెండొంతులు వాళ్లే ఉన్నారు. ఇలాంటి సభలో మహిళల కోసం ఇలా ప్రత్యేకంగా బిల్ తీసుకురావడం ఆహ్వానించాల్సిన విషయమని అంటున్నారు అక్కడి ప్రజలు. ప్రస్తుతం పార్లమెంట్‌లో ప్రత్యేకంగా బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్‌ని కూడా ఏర్పాటు చేశారు.