ఇటలీ పార్లమెంట్‌లో బుధవారం (జూన్ 7) ఓ బిడ్డకు తల్లిపాలు ఇచ్చారు. రాయిటర్స్ చెప్పిన వివరాల ప్రకారం ఇటలీ మహిళా ఎంపి గిల్డా స్పోర్టిలో తన కుమారుడు ఫెడెరికోకు ఛాంబర్ ఆఫ్ డిప్యూటీలో పాలు పెట్టారు. ఎంపీలంతా హర్షధ్వానాలతో  ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. దీంతోపాటు ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. 


తల్లి పాలివ్వడం చాలా దేశాలలో సాధారణం. అయితే, ఇటలీ వంటి పురుషాధిక్య దేశంలో దిగువ సభలోని ఒక సభ్యురాలు సభలో బిడ్డకు పాలివ్వడం ఇదే తొలిసారి. పార్లమెంటరీ సమావేశాలకు అధ్యక్షత వహించిన జార్జియో ములే మాట్లాడుతూ అన్ని పార్టీల మద్దతుతో ఒక సభ్యురాలు సభలో బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ఇదే మొదటిసారని అన్నారు.


గత ఏడాది నవంబరులో
ఇటలీలోని పార్లమెంటరీ రూల్స్ ప్యానెల్ మహిళా ఎంపీలు తమ పిల్లలతో పార్లమెంటు గదికి రావడానికి, ఏడాది వయస్సు ఉన్న బిడ్డకు పాలివ్వడానికి అనుమతించింది. ఇటలీలోని లెఫ్ట్ వింగ్ ఫైవ్ స్టార్ మూవ్మెంట్ పార్టీకి చెందిన గిల్డా స్పోర్టిలో మాట్లాడుతూ చాలా మంది మహిళలు అకారణంగా తల్లి పాలివ్వడాన్ని ఆపివేస్తారని చెప్పారు. మహిళలు తమ ఇష్టపూర్వకంగా ఇలా చేయబోరని.. కానీ ఆఫీస్‌కు వెళ్లాలనో లేదా, బహిరంగ ప్రదేశమనో వారు అలా చేస్తుంటారని చెప్పారు. 


బుధవారం నాటి ఘటన ఇటలీకి మొదటిది అయితే, 13 సంవత్సరాల క్రితం, సెంటర్-రైట్ ఫోర్జా ఇటాలియా పార్టీలో సెనేటర్‌గా ఉన్న లిసియా రోంజుల్లి, స్ట్రాస్‌బర్గ్‌లోని యూరోపియన్ పార్లమెంట్‌లో తన కుమార్తెకు పాలిచ్చారు.