Iran Attacks Israel: అన్ని ప్రధాన నగరాలు విడిచి వెళ్లిపోండి, ఇజ్రాయెల్ ప్రజల్ని హెచ్చరించిన ఇరాన్ సైన్యం
Iran Israel Conflict | దక్షిణ ఇజ్రాయెల్ మీద బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ సైన్యం విరుచుకుపడింది. 20 కంటే ఎక్కువ బాలిస్టిక్ మిస్సైల్స్ తో దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది.
Iran Israel Conflict | ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత మరింత పెరుగుతోంది. ఇరాన్ మంగళవారం నాడు 20 బాలిస్టిక్ మిస్సైల్స్ ను టెల్ అవీవ్‌పై ప్రయోగించగా భారీగా నష్టం సంభవించింది. దక్షిణ ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైల్స్ వర్షం కురిపించడంతో అధికారులు సైరన్స్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. దక్షిణ ఇజ్రాయెల్ ప్రజలు ప్రాణభయంతో షెల్టర్ కోసం పరుగులు తీస్తున్నారు. గంట సమయంలోనే రెండోసారి ఇరాన్ మిస్సైల్స్ ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపాయి. ఇరాన్ చేసిన తాజా దాడులతో దక్షిణ ఇజ్రాయెల్ ఉలిక్కిపడింది.
ప్రధాన నగరాలు వదిలి వెళ్లిపోండి
Just In
మరిన్ని దాడులు కొనసాగుతాయని అన్ని ప్రధాన నగరాలను విడిచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ పౌరులను ఇరాన్ సైన్యం హెచ్చరించింది. మంగళవారం నాడు ఇరాన్ తమ దాడులను ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్ లోని ప్రధాన నగరాలే తమ లక్ష్యమని నేరుగానే సంకేతాలిచ్చింది. ఇరాన్‌లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుండి 70 ఇరాన్ వైమానిక రక్షణ బ్యాటరీలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ రిపోర్ట్ చేసింది.
పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు- ఇజ్రాయెల్
ఇరాన్ ప్రభుత్వం, బలగాలు తమ దేశానికి చెందిన పౌరులు, సామాన్యులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ అన్నారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ "అణు, క్షిపణి దాడులను" ఎదుర్కోవడం లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టం చేశారు. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో సామాన్య ప్రజలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై అమెరికా సైనిక ఆధిపత్యం గురించి మాట్లాడారు. ఇరాన్ పై అమెరికా పూర్తి నియంత్రణ కలిగి ఉందన్నారు. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ బేషరతుగా లొంగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఖమేనీ ఎక్కడ ఉన్నాడో తమకు తెలుసునని, అది గుర్తించుకోవాలని.. అమెరికా సహనాన్ని పరీక్షించవద్దు అన్నారు.
ట్రూత్ సోషల్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో, ఇరాన్ పటిష్ట రక్షణ సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, అవి అమెరికన్ టెక్నాలజీని ఎదుర్కోవడానికి సరిపోవన్నారు. "ఇరాన్ మంచి స్కై ట్రాకర్లు, ఇతర రక్షణ పరికరాలు కలిగి ఉంది. వాటిని అమెరికన్లు తయారు చేసిన అస్త్రాలు, ఆయుధాలతో పోల్చలేరు. ఇరాన్ నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఉన్న ప్రదేశం గురించి అమెరికా వద్ద సమాచారం ఉంది. కానీ ప్రస్తుతానికి ఆయనను టార్గెట్ చేసుకోకుండా వదిలేస్తున్నాం అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున ట్రంప్ జీ7 సమ్మిట్ జరుగుతున్నా తిరిగి వచ్చేశారు. స్పెషల్ వార్ రూమ్స్ ఏర్పాటు చేసి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నారని వైట్ హౌస్ చెబుతోంది.