Congress's Strategy For Monsoon Session: రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు పార్టీ వ్యూహాలు ఖరారు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. మంగళవారం పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆ పార్టీ పార్లమెంటరీ నాయకురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ఆమె ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ నేతల కీలక సమావేశం జరగనుంది. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే తమ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. పలు అంశాలపై పార్లమెంట్లో గళమెత్తేందుకు కాంగ్రెస్ ఎంపీలు ప్రణాళికలు రచించనున్నారు.
పలు అంశాలపై గళమెత్తనున్న ప్రతిపక్షాలుబిహార్‌లో ఎన్నికల సంఘం ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణను చేపట్టడంపై తీవ్ర ఆందోళన చేపట్టేందుకు సిద్ధం కానుంది. అలాగే పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్‌తో పాటు ఆ తర్వాత జరిగిన దౌత్యపరమైన చర్యలపై కూడా చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
జన్‌పథ్ నివాసంలో సమావేశంసోనియా గాంధీ అధ్యక్షత వహించే కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహాత్మక బృందం సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తదితరులు పాల్గొంటారని తెలుస్తోంది. ఢిల్లీలోని జనపథ్ నివాసంలో సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
పహల్గామ్ దాడి.. ట్రంప్ జోక్యంపై మాట్లాడాలని డిమాండ్ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై జరిపిన ఆపరేషన్ సిందూర్ దాడిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అణు యుద్ధాన్ని నివారించేందుకు భారతదేశం-పాకిస్తాన్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి.
సమావేశాలు వారం రోజులపాటు పొడిగింపుపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభమై ఆగస్టు 21 వరకు కొనసాగుతాయని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. గతంలో ఈ సమావేశాలు ఆగస్టు 12కే ముగిసేవి. ఇప్పుడు వారం రోజులపాటు సమావేశాలను పొడిగించారు. అణుశక్తి రంగంలో ప్రైవేట్ రంగం ప్రవేశాన్ని సులభతరం చేసే చట్టాలతో సహా కీలక చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సమావేశాల వ్యవధిని మరింత పొడిగించారు. అణుశక్తి రంగంలో ప్రైవేట్‌ను ఎంకరేజ్ చేసేందుకు కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రకటనను అమలు చేసేలా ‘పౌర అణు నష్ట బాధ్యత చట్టం’, ‘అణుశక్తి చట్టం’ను సవరించాలని యోచిస్తోంది.