PM Narendra Modi G7 Summit: సభ్య దేశం కాకపోయినా భారత్‌కు ఈ ఏడాది జీ7 సమ్మిట్‌లో పాల్గొనే అవకాశం లభించడంతో ప్రధాని మోదీ కెనడాకు వెళ్లారు. అదే వేదికగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఉగ్రవాదంపై పాక్ తీరును ఎండగట్టారు. కెనడాలోని కనానిస్కిస్‌లో మంగళవారం జరిగిన G-7 సమ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ఉగ్రవాదంపై కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. G-7 సమ్మిట్ సందర్భంగా దక్షిణ కొరియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా అధినేతలను కలిశారు. తనకు అవకాశం ఇచ్చిన నేతలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.
కెనడాలోని కనానాస్కిస్‌లో జరిగిన G7 ఔట్రీచ్ సెషన్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన జరిగిన ఉగ్రవాద దాడి కేవలం ఆ ప్రాంతం మీద దాడి మాత్రమే కాదు, ప్రతి భారతీయుడి గుర్తింపు, గౌరవంపై జరిగిన దాడి. ఇది మొత్తం మానవాళిపై జరిగిన ఉగ్రదాడి. ఉగ్రవాదం మానవాళికి శత్రువు, అది ప్రతి ఒక్కరికీ ముప్పులాంటిది. ఇది ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునే అన్ని దేశాలకు వ్యతిరేకం. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం, మన ఆలోచనలు, విధానాలు స్పష్టంగా ఉండాలి. ఏ దేశమైతే ఉగ్రవాదాన్ని సమర్థిస్తుందో అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది." అన్నారు.
గ్లోబల్ సౌత్ దేశాల గురించి మోదీ ఏమన్నారు
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఒకవైపు అన్ని రకాల ఆంక్షలు విధించడానికి మేం సిద్ధంగా ఉన్నాము. మరోవైపు, ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థించే దేశాలకు రిటర్న్ గిఫ్ట్‌లు సైతం లభిస్తున్నాయి. దురదృష్టవశాత్తు, గ్లోబల్ సౌత్ దేశాలు అనిశ్చితి, సంఘర్షణలతో ఎక్కువ ప్రభావితం అవుతున్నాయి. ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థిక సంబంధిత సంక్షోభాలతో వారు ప్రభావితం అవుతున్నారు. ఆ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి, సమస్యలను ప్రపంచ వేదికపైకి తీసుకురావడాన్ని భారతదేశం తన బాధ్యతగా భావిస్తుందని'' పేర్కొన్నారు.
మోదీకి కెనడా ప్రధాని స్వాగతం
ప్రధాని మోదీకి కనానిస్కిస్‌లో కెనడా ప్రధాని మార్క్ కార్నీ మంగళవారం ఘన స్వాగతం పలికారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ 'X'లో పోస్ట్ చేస్తూ, ''ప్రపంచ పురోగతి, సహకారం కోసం అడుగులు పడుతున్నాయి. కెనడా ప్రధాని మార్క్ జె. కార్నీ కెనడాలోని కనానిస్కిస్‌లో జరిగిన G-7 సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికారని'' అని రాసుకొచ్చారు.