Israeli Defence Force Targets:పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు యావత్ ప్రపంచానికే కునుకు లేకుండా చేస్తున్నాయి. తనను నాశనం చేయాలనే ఆలోచన చేస్తున్న శత్రువుల ఉనికే లేకుండా చేస్తోంది ఇజ్రాయెల్. ఇప్పటికే హమాస్‌ను తుదముట్టింది. హిజ్బుల్లాను సర్వనాశనం చేసింది. ఇప్పుడు ఇరాన్‌పై గురి పెట్టింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం గుప్పెట్లో యావత్ ప్రపంచం ఉందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. 


ఇజ్రాయెల్ సైన్యం గత 4 రోజుల్లో  ఒకటి కాదు రెండు కాదు 2వేలకుపైగా శత్రుస్థావరాలను ధ్వంసం చేసింది. హిజ్బుల్లా బిగ్ హెడ్స్‌తోపాటు వారికి సపోర్టు చేసే వారిని వెతికి వెతికి సంహవరిస్తోంది. ఇలా వందల మంది ప్రాణాలు తీసింది ఇజ్రాయెల్. ఇలా ఇజ్రాయెల్ దాడిలో కుప్పకూలిన వారిలో ఐదుగురు బెటాలియన్ కమాండర్లు, 10 కంపెనీ కమాండర్లు, 6 ప్లాటూన్ కమాండర్లు ఉన్నారు. హిజ్బుల్లా సంస్థలోని పెద్దలను లేపేసిన ఇజ్రాయెల్ శాంతించలేదు. శత్రుశేషం ఉండకూడదన్న లక్ష్యంతో దక్షిణ లెబనాన్‌లో దాడులు చేస్తోంది.


ఇలా లెబనాన్‌లో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఇరాన్‌కు కునుకు పట్టనీయడం లేదు. అందుకే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దూకుడును చూస్తున్న ఇరాన్‌ ప్రతి చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్‌పై ఇరాన్ వందల కొద్దీ రాకెట్లు ప్రయోగించింది. అయితే వాటిని ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీనికి సంబంధించినవీడియోలు సోషల్ మీడియాలో వందల సంఖ్యలో ఉన్నాయి. 


పరిస్థితులు ఇలా ఉన్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ శుక్రవారం చేసిన ప్రకటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. "శత్రువు ప్రణాళికలు తిప్పికొట్టాలి. ఇరాన్, లెబనాన్‌కు ముస్లింల సంఘీభావాన్ని ప్రకటించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఐక్యంగా ఉండాలి. శత్రువుల కదలికల పట్ల జాగ్రత్త వహించాలి. అందరూ ఐక్యంగా ఉంటూ అల్లా చూపిన మార్గంలో పయనించాలి. అని విజ్ఞప్తి చేశారు. 


హిజ్బుల్లా చీఫ్ తో మొదలు పెట్టిన ఇజ్రాయెల్ 
ఇజ్రాయెల్ ఈ వారం రోజులుగా హిజ్బుల్లా అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ ఆపరేషన్‌లో హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను హతమార్చింది. ఆ తర్వాత అతని కజిన్ హషీమ్ సఫీదిన్‌ను చంపేసింది. ఇజ్రాయెల్ హిజ్బుల్లా ప్రధాన కమాండర్లందరినీ ఫినిష్ చేసింది. పశ్చిమాసియాలోని మీడియా కథనాల ప్రకారం ఈ హిజ్బుల్లా సేనల్లో సీనియర్ కమాండర్ అబూ అలీ రిదా మాత్రమే ఇప్పటికి జీవించి ఉన్నారు. 


ప్రస్తుతం హిజ్బుల్లాతో ప్రత్యక్ష పోరు చేస్తున్న ఇజ్రాయెల్ ఇరాన్‌తో యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇది ఏడాది క్రితం పాలస్తీనాలోని హమాస్‌ జరిపిన ఆకస్మిక రాకెట్‌ దాడితో మొదలైంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ నహల్ ఓజ్ స్థావరంపై హమాస్ అకస్మాత్తుగా దాడి చేసింది. వందల క్షిపణులు ప్రయోగించింది. అయితే అవన్నీ కూడా ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న  ఐరన్ డోమ్‌ను మాత్రమే తాకాయి. 


ఈ దాడి తర్వాత హమాస్ సైన్యం ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది.  ఈక్రమంలో దాదాపు 1,200 మందిని ఇజ్రాయెల్‌ ప్రజలను హమాస్ పొట్టన పెట్టుకుంది. అంతే కాకుండా చాలా మందిని తమ వద్ద బందీలుగా మార్చుకుంది. 


హామాస్ రెచ్చిపోవడంతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేపట్టింది. దాదాపు ఒక నెల తరువాత ఇజ్రాయెల్ దళాలు గాజాలో అడుగుపెట్టాయి. మెళ్లిమెళ్లిగా హమాస్ నెట్‌వర్క్‌ను నాశనం చేశాయి. ఈ వార్‌లో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించారు. అలా మొదలై వార్‌తో ప్రపంచంలోని దేశాలు రెండు శిబిరాలుగా విడిపోయాయి. ఇజ్రాయెల్‌కు పాశ్చాత్య దేశాలు మద్దతు ఇస్తుండగా, పాలస్తీనాకు చైనా, రష్యా, ఇరాన్ అనుకూలంగా ఉన్నాయి.


ఇజ్రాయెల్‌కు తలనొప్పిగా మారిన దేశాలు?


ఇజ్రాయెల్‌పై అనేక అరబ్ దేశాలు రగిలిపోతున్నాయి. అంటూ చుట్టూ శత్రుదేశాల మధ్యే ఉంది. హమాస్, ఇరాన్, హిజ్బుల్లాతోనే కాకుండా అనేక ఇతర వ్యవస్థలతో ఇజ్రాయెల్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో పోరాడుతోంది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్, వెస్ట్ బ్యాంక్, సిరియా, హమాస్, హిజ్బుల్లా, ఇరాన్ ఇజ్రాయెల్‌కు తలనొప్పిగా మిగిలిపోయాయి. అందుకే ఈ దేశాల్లో ఏం జరిగిన ఇజ్రాయెల్ అప్రమత్తమవుతూ ఉంటుంది.